
- పంట ఎదుగుదల దశలో రైతుల్లో ఆందోళన
- జిల్లాలో ఇప్పటికే 18 వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
ఆదిలాబాద్, వెలుగు : కళ్లముందే రాలుతున్న పూత.. మురిగిపోయిన కాయలను చూసి పత్తి రైతు కన్నీరు పెడుతున్నాడు. ఈ ఏడాది భారీ వర్షాలు పత్తి రైతును నిండా ముంచాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు,
సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు, వరదలతో పత్తి పంట భారీ స్థాయిలో దెబ్బతిన్నది. ప్రస్తుతం పత్తి పంట ఎదుగు దశలో ఉంది. పూత, కాయ కాస్తోంది. ఈ సమయంలో వర్షాలు పడుతుండటంతో పూత రాలిపోతోంది. కాయలు మురిగిపోతున్నాయి. ప్రతి రోజు వర్షం పడుతుండటంతో ఆకులు ఎర్రబారుతున్నాయి.
ఇప్పటికే వర్షాలు, వరదలతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇప్పుడు పంట ఎదుగుతున్న సమయంలోనూ వర్షాలు పడుతుండటంతో పంట ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. దీంతో దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 35 వేలు రైతులు పెట్టుబడి పెట్టారు. వర్షాలు ఇలాగే పడితే పెట్టుబడి ఖర్చులు సైతం రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
80 శాతం సాగు పనులు పూర్తి
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో 5.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో పత్తి పంటే 4.40 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మందులు పిచికారీ చేస్తున్నారు. ఇంకో రెండు మూడు సార్లు మందులు వేస్తే పనులు పూర్తయినట్లే. 40 రోజుల్లో పత్తి పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి రోజు వర్షం ఆగకుండా పడుతోంది. ఇంకా వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఉన్న కొద్దిపాటి కాత, పూత సైతం రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
18 వేల ఎకరాల్లో పంట నష్టం
జిల్లాలో సాధారణ వర్షపాతం 921.5 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటివరకు1223.1 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణం కంటే 33 శాతం అధికంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, వరదలతో 18,310 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు లెక్క తేల్చారు. అత్యధికంగా పత్తి పంట 14,225 ఎకరాలు, సోయా 9,152 ఎకరాల్లో నష్టం జరిగింది. 12,338 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. పెన్ గంగా పరివాహక ప్రాంతాల్లోనే ఎక్కువగా పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు.
కాయలు మురిగిపోతున్నయి
ఈ ఏడాది 6 ఎకరాల్లో పత్తి పంట వేసిన. భారీ వర్షాలకు పంట సగం దెబ్బతిన్నది. ఎడతెరపి లేని వర్షాలకు పంట ఎర్రబారి పూత రాలిపోతోంది. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు చేసినం. వర్షాలు ఇట్లనే పడితే దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడి ఖర్చులు కూడా రావు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.– భూమన్న, బండల్ నాగాపూర్, ఆదిలాబాద్