- ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు
- చెల్లాచెదురుగా మృతదేహాలు
- పక్కనున్న కార్లు,ఆటో రిక్షాలు బుగ్గి
- దగ్గరలోని షాపులు,ఇండ్ల అద్దాలు ధ్వంసం
- ఘటనా స్థలానికి ఫోరెన్సిక్, ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు
- దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం
- పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన అమిత్ షా
- హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులకు పరామర్శ
- బ్లాస్ట్‌పై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని ప్రకటన
- మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం
- నేడు బిహార్ ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: భారీ పేలుడుతో దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్ట్‌లో 9 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలాన్ని మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. అరుపులు.. ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఓ వ్యక్తి డెడ్‌బాడీ కారు సైడ్ మిర్రర్‌పై వేలాడుతూ కనిపించింది. ఆటో రిక్షాపై ఓ వ్యక్తి చేయి తెగిపడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయంత్రం 6.52 గంటలకు హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్లాస్ట్ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని, వెహికల్ స్లోగా మూవ్ అవుతున్నదని చెప్తున్నారు. పేలుడు ధాటికి 22 కార్లు, 2 ఈ -రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కొన్ని మీటర్ల దూరం వరకు పార్క్ చేసిన వాహనాల అద్దాలూ ధ్వంసం అయ్యాయి. ఇండ్లు, దుకాణాల తలుపులు, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం అనంతరం 20 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. పేలుడు ఘటనలో 24 మందిగాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఎల్ఎన్జేపీ హాస్పిటల్‌కు తరలించారు.
ఘటనా స్థలం నుంచి బుల్లెట్ స్వాధీనం
పేలుడు నేపథ్యంలో ఎర్రకోట, చాందినీచౌక్ వైపు వెళ్లే అన్ని దారులను ఢిల్లీ పోలీసులు మూసివేశారు. ఈ బ్లాస్ట్‌తో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. దేశమంతా హైఅలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాతో హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా బ్లాస్ట్‌పై బ్రీఫింగ్ ఇచ్చారు. ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీ, ఫోరెన్సిక్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు, బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నది. కాగా, ఘటనా స్థలం సమీపంలో బుల్లెట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ముంబైలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు
ఢిల్లీలో పేలుడుతో బిహార్, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్‌తో పాటు హైదరాబాద్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేసింది. ముంబైలోని రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఫైవ్ స్టార్ హోటళ్ల వద్ద బలగాలను మోహరించింది. రైల్వే, మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేపట్టింది. అనుమానాస్పద వస్తువులు ఏమైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మైక్‌లో పోలీసులు అనౌన్స్ చేశారు. ఎక్కువ రోజులుగా పార్కింగ్ చేసిన టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ముంబై పోలీసులు ప్రజలకు సూచించారు. బిహార్‌లో మంగళవారం ఫైనల్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నితీశ్ సర్కార్ తనిఖీలు ముమ్మరం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచింది.
దేశ సరిహద్దుల్లోనూ హై అలర్ట్
ఢిల్లీ, హర్యానా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్ సహా అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాలు, లాడ్జీలను చెక్ చేస్తున్నారు. ఇండియా, పాక్ బార్డర్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు ఇండియా – నేపాల్, ఇండియా–చైనా సరిహద్దుల్లోనూ పెట్రోలింగ్ పెంచారు.
పేలుడుపై సమగ్ర విచారణ జరిపిస్తాం: అమిత్ షా
ఢిల్లీలో పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎల్ఎన్జేపీ హాస్పిటల్వెళ్లారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ‘సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశించాం’ అని అమిత్ షా తెలిపారు.
హర్యానా నంబర్ ప్లేట్..
ఢిల్లీ బ్లాస్ట్‌కు కారణమైన కారు.. హర్యానాకు చెందిన (హెచ్ఆర్ 26 సీఈ 7674) హ్యుందాయ్ ఐ20గా పోలీసులు గుర్తించారు. కారు ఫస్ట్ ఓనర్ మహ్మద్ సల్మాన్‌ను హర్యానా పోలీసులు గుర్గావ్లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన కారును తారిఖ్‌కు అమ్మినట్లు అతను తెలిపాడు. తారిఖ్.. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాకు చెందినవాడని వివరించాడు. ఇప్పుడు కారు నదీమ్ ఖాన్పేరు మీద ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ కారు పలువురి చేతులు మారినట్లు ఆర్టీవో డేటాబేస్‌తో స్పష్టమైంది. జూన్‌లో చివరిసారిగా సౌతీస్ట్ ఢిల్లీలోని బదర్పూర్లో ఆటో మేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైషన్ (ఏఎన్పీఆర్) కెమెరాకు ఈ కారు చిక్కింది.
ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈమేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. ‘‘పేలుడు ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించా. హోంమంత్రి అమిత్ షా, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షించారు” అని మోదీ తెలిపారు.
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు ఘటన అత్యంత విషాదకరం. పేలుడులో పలువురు మరణించడం బాధాకరం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటా. వారికి సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
- రాహుల్ గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత
భారీ శబ్దంతో పేలింది..
పేలుడు ధాటికి ఘటనా స్థలం నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్ షేక్ అయిందని చాందినీ చౌక్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పేలుడు జరిగినప్పుడు తాము అక్కడే ఉన్నామని చెప్పారు. బ్లాస్ట్ జరిగినప్పుడు తాను గురుద్వారాలో ఉన్నా అని, బయటికొచ్చి చూస్తే కార్లు, ఆటోలు కాలిపోతున్నాయని మరో సాక్షి తెలిపాడు. భారీ శబ్ధం వినిపించిందని చెప్పాడు. 2 అడుగుల ముందు ఉన్న కారు ఒక్కసారిగా పేలిపోయిందని ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆటో డ్రైవర్ జీషాన్ తెలిపాడు. అప్పుడు ఏమైందో తెల్వలేదని, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని చెప్పాడు. భారీ శబ్ధంతో కారు బ్లాస్ట్ అయిందని వివరించాడు.
