ఒకే రాత్రి తొమ్మిది ఇండ్లలో చోరీ

ఒకే రాత్రి తొమ్మిది ఇండ్లలో చోరీ
బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లాలో దొంగల ముఠా రెచ్చిపోయింది. బచ్చన్నపేట మండలం రామచంద్రగూడెం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి తొమ్మిది ఇండ్లలో దోపిడీ చేశారు. ఇండ్ల తాలాలు పగలగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. బాధిత కుటుంబాల్లో కొందరు హైదరాబాద్​కు వెళ్లగా మరికొన్ని కుటుంబాలు బంధువుల ఇండ్లకు ఫంక్షన్లకు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకున్న దొంగల ముఠాకు ఓ మహిళ నాయకత్వం వహించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. సోమవారం పొద్దున పూట ఓ మహిళ బుట్టపట్టుకుని రామచంద్రగూడెం గ్రామంలో ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసిందని, అప్పుడే తాళం వేసి ఉన్న ఇండ్లను ఆమె ఎంచుకుందని అంటున్నారు. అడుక్కునేందుకు వచ్చేముందు ఆమెను ఎవరో మారుతీ కారులో ఊరి చివర డ్రాప్ చేసి వెళ్లినట్లు చూశామని, అదే మహిళ రాత్రిపూట కూడా గ్రామంలో కనిపించిందని గ్రామస్తులు చెప్పారు. తొమ్మిది ఇళ్లలో 6 తులాల బంగారం, రూ.70వేల నగుదు చోరికి గురైనట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులపై చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చోరీ జరిగిన ఇళ్లలోని బీరువాలు, వస్తువుల నుంచి వేలిముద్రలను క్లూస్​టీమ్​ సేకరించింది. జనగామ డీసీపీ శ్రీనువాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్​, ఎస్సై లక్ష్మణ్​రావు గ్రామంలోని స్పాట్​లను పరిశీలించారు.