
గుజరాత్ లో బ్రిడ్జి కూలిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం (జులై 09) ఒక్కసారిగా కూలిపోవడంతో భారీ ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న 5 వాహనాలు నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో మొదట ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు. పలువురు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయినట్లు మంత్రి రిశికేష్ పటేల్ వెల్లడించారు. మరికొంత మంది కోసం NDRF బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయని తెలిపారు.
బ్రిడ్జిపై పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. మూడు నెలల క్రితమే రూ.212 కోట్లు సాంక్షన్ చేశామని.. టెండర్లు కూడా మొదలైనట్లు చెప్పారు. అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు.
ఇక 1981లో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణం 1985లో పూర్తయ్యింది. అయితే బ్రడ్జిపై పెరుగుతున్న రాకపోకలు, ట్రాఫిక్ దృష్ట్యా.. హెవీ వెహికిల్స్ ను బ్రిడ్జిపై నుంచి నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ 2017లోనే ప్రభుత్వానికి నివేదించిందనీ.. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
గుజరాత్, సౌరాష్ట్ర మధ్య గత 40 ఏళ్లుగా రవాణా సేవలకు ఆధారమైన బ్రిడ్జి కూలిపోవడం తీవ్ర నష్టంగా స్థానికులు చెబుతున్నారు. మహిసాగర్ నదిపై 832 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పులో బ్రిడ్జిని నిర్మించారు. 1981లో ప్రారంభమైన నిర్మాణం..1985లో పూర్తయ్యింది. బ్రిడ్జికి ఇరువైపులా మీటరునర ఫుట్ పాత్ లు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఈ బ్రిడ్జిని రూ.3.16 కోట్లతో నిర్మించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..?
చాలా కాలంగా గంభీరా బ్రిడ్జి మరమ్మత్తులతో నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండవచ్చుననే ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఇంజినీర్లు. కానీ ప్రభుత్వం కొత్త బ్రిడ్జిపై దృష్టిపెట్టకపోవడం తో ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చామని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది.