
కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కే తమ ఓట్లన్నీ వేస్తామని కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో, తమ పంచాయతీ పరిధిలోని ప్రజలు మొత్తం కేసీఆర్‌కే ఓటు వేస్తామని మాచారెడ్డి మండలంలోని 8, పాల్వంచ మండలంలో ఓ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశాయి. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి తండా, వెనుకతండా, నడిమితండా, నెమ్లిగుట్ట తండా, బొడిగుట్ట తండా, మైసమ్మ చెరువు తండా, రాజ్‌ఖాన్‌పేట, పాల్వంచ మండలంలోని మంథని దేవునిపల్లి పంచాయతీ పాలక వర్గాలు తీర్మానాలు చేశాయి.
పంచాయతీ లెటర్‌హెడ్‌పై కేసీఆర్ కు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు రాసి సర్పంచులు, ఉప సర్పంచులు సంతకాలు చేశారు. అంతకుముందు ఆయా చోట్ల ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకాలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు. కాగా, సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్‌లో కూడా బీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని అక్కడి గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
పార్టీ తీర్మానాన్ని ప్రజా తీర్మానంగా ఎలా చెప్తరు?
బీఆర్ఎస్ పార్టీ చేసే తీర్మానాన్ని ప్రజా తీర్మానంగా ఎలా చూపుతారని కాంగ్రెస్మాచారెడ్డి మండల ప్రెసిడెంట్గణేశ్నాయక్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలతో వారు ముందుకెళ్తారన్నారు. గ్రామం మొత్తం బీఆర్ఎస్కు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తోందని తీర్మానించడం కరెక్ట్కాదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతామన్నారు.