మా అమ్మ ఫోన్ ఇవ్వండి.. పోలీసులకు చిన్నారి కన్నీటి లేఖ

మా అమ్మ ఫోన్ ఇవ్వండి.. పోలీసులకు చిన్నారి కన్నీటి లేఖ

బెంగళూరు: కరోనా మహమ్మారి తన తల్లిని బలి తీసుకుంది. కనిపించని లోకాలకు అమ్మ వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవాలని అనుకుంది ఆ చిన్నారి. అమ్మ ఫోన్ లో ఉన్న ఫొటోలు, వీడియోలను దాచుకోవాలని అనుకుంది. కానీ పాప అనుకున్నది జరగలేదు. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ సమయంలో తన తల్లి వద్ద ఉన్న ఫోన్.. తర్వాత మిస్ అయింది. అమ్మకు సంబంధించిన వస్తువులను ఇచ్చారు కానీ.. ఫోన్ మాత్రం ఇవ్వలేదు. ‘కనిపించడం లేదు’ అని చెప్పి హాస్పిటల్ సిబ్బంది చేతులు దులుపుకున్నారు. దీంతో పోలీసులకు కన్నీటి లెటర్ రాసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై స్వయంగా రాష్ట్ర డీజీపీ స్పందించారు. ఫోన్ ఎలాగైనా తెచ్చిచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కర్నాటకలోని కొడగుకు చెందిన తొమ్మిదేళ్ల హృతీక్ష తల్లి టీకే ప్రభ(36) ఈ నెల 16న కరోనాతో కన్నుమూశారు. తన తల్లికి సంబంధించిన వస్తువులు ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది.. ఫోన్ మాత్రం ఇవ్వలేదు. దీంతో హృతీక్ష కొడగు పోలీసులను ఆశ్రయించింది. తల్లి జ్ఞాపకాలు ఉన్న ఫోన్‌‌ను కనిపెట్టండంటూ కోరింది. కొడగు డిప్యూటీ కమిషనర్, ఎమ్మెల్యే, కొవిడ్ హాస్పిటల్ సిబ్బందికి లెటర్ రాసింది. ‘‘అమ్మ, నాన్న, నేను కరోనా బారిన పడ్డాం. అమ్మ ఆరోగ్యం విషమించడంతో మదికేరి కొవిడ్ హాస్పిటల్​లో జాయిన్ చేశాం. 16న అమ్మ చనిపోయింది. ఆమెతో ఉన్న ఫోన్​ను ఎవరో తీసుకున్నారు. ఆ ఫోన్​లో అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. దాన్ని ఎవరు తీసుకున్నా తిరిగి ఇవ్వాలని కోరుతున్నా’’అని ఫిర్యాదులో పేర్కొంది చిన్నారి. కుషాల్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు ఫోన్ కోసం వెతుకుతున్నారు. మరోవైపు ఇండియన్ యూత్ కాంగ్రెస్ వాలంటీర్లు.. హృతీక్షకు కొత్త ఫోన్ అందజేశారు.