
కొంత ఎత్తు నుంచి కిందికి చూడ్డానికే భయపడతారు చాలామంది. అలాంటిది వేల అడుగుల ఎత్తున ఎగిరే విమానంలోనుంచి స్కై డైవ్ చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే. అందుకే ఇలాంటి సాహసాలను ఎక్కువగా యువతే చేస్తుంటారు. కానీ, ఒక సోషల్ కాజ్ కోసం 15 వేల అడుగుల ఎత్తునుంచి స్కై డైవ్ చేయడానికి ముందుకొచ్చాడు తొంభై ఏండ్ల ఫ్రాంక్ వర్డ్.
ఫ్రాంక్ వర్డ్ యుకేలోని యార్క్‌షైర్ నివాసి. అడ్వెంచర్స్ చేయడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఈయన. హాస్పిటల్‌లో తన భార్యకు ఎదురైన ఇబ్బంది వేరేవాళ్లకు రాకూడదని ఈ అడ్వెంచర్ చేశాడట. వివరాల్లోకి వెళ్తే.. తన భార్య మార్గరెట్ వర్డ్‌కు ఎనభైయొక్కేండ్లు. పద్దెనిమిది నెలల క్రితం అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరింది. హాస్పిటల్‌లో స్ట్రెచర్స్, బెడ్స్, వీల్ చెయిర్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు వాళ్లు. అక్కడ ఉన్నన్ని రోజులు తమకులా ఇబ్బంది పడుతున్న చాలామందిని చూశారు. అప్పుడే మార్గరెట్ ఫ్రాంక్‌తో ‘మనవంతు సాయంగా ఈ హాస్పిటల్‌కి ఏదైనా చేద్దాం’ అని అడిగింది. దానికి ఫ్రాంక్ కూడా ఒప్పుకున్నాడు. మార్గరెట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. కానీ, హాస్పిటల్‌కి అవసరమైన వస్తువులు సమకూర్చడానికి వీళ్లదగ్గర కావాల్సిన డబ్బులేదు. డబ్బు కోసం వేరేవాళ్లని అడగలేక అడ్వెంచర్ చేసి ‘సోషల్ కాజ్’ కోసం డొనేషన్స్ అడగాలనుకున్నాడు ఫ్రాంక్. ఆ ఆలోచన రావడం ఆలస్యం తను స్కై డైవ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టి డొనేషన్ అడగటం మొదలుపెట్టాడు.
మొదటి సారి స్కై డైవ్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు ఫ్రాంక్. 15,000 అడుగుల ఎత్తునుంచి దూకినప్పుడు గాలి ఒత్తిడికి శ్వాస సరిగా ఆడలేదు. కొద్దిసేపటి వరకు చెవులు కూడా వినిపించలేదు. కిందికి దిగిన తర్వాత ‘ఇబ్బందిగా ఉంటే వద్దు సార్’అని మెయింటెనెన్స్ అతను అంటే ‘నాకేం ఫర్వాలేదు. ఇప్పుడు వెళ్దాం పద’ అని చెప్పి మళ్లీ స్కై డైవ్‌కి వెళ్తాడు ఫ్రాంక్. ఈ పెద్దాయన చేసిన అడ్వెంచర్‌కి ఇప్పటివరకు 2000 డాలర్లు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఆ డబ్బుతో తన భార్య అనుకున్నది చేస్తానని గట్టిగా చెప్తున్నాడు ఫ్రాంక్.