- కొలనుపాక కల్యాణ చాళుక్య శాసనాన్ని పరిరక్షించాలె
- పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు 6 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ జైన క్షేత్రం కొలనుపాకలో కల్యాణ చాళుక్యుల కాలం నాటి శాసనం కంప చెట్ల మధ్య నిరాదరణకు గురవుతోంది. క్రీస్తుశకం1125 నాటి ఈ జైన శాసనం నాశనమయ్యే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక సోమేశ్వర స్వామి దేవాలయ పరిరక్షణ పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం ఆయన హెరిటేజ్ ఆర్కిటెక్ట్ శ్రీలేఖతో కలసి కొలనుపాక చెరువులోని ఊబదిబ్బపై ముళ్ల పొదలు, చెట్ల మధ్య ఉన్న శాసన స్తంభాన్ని పరిశీలించారు. చుట్టూ 300 మీటర్ల మేర గుబురు చెట్లు, బురద మధ్య ఉన్న ఈ శాసన స్తంభాన్ని చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 23 అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభం నలువైపులా 151 పంక్తుల కన్నడ శాసనం చెక్కి ఉందని, ముళ్ల కంపను తొలగించుకుంటూ అతి కష్టం మీద తాము అక్కడికి చేరుకున్నామని తెలిపారు.
‘‘కల్యాణ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యుడి కొడుకు సోమేశ్వరుని ప్రశస్తి ఈ శాసనం వేయించాడు. అంబర తిలకమనే జైనబసది.. అంగరంగ భోగానికి పానుపురాయి అనే గ్రామాన్ని సర్వబాధా పరిహారంగా దానం చేశాడు. ఈ శాసనాన్ని అంబికాదేవి మంత్రి కేశిరాజు అమలు జరిపాడు” అని శాసనంలో రాసి ఉన్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. గతంలో నెలటూరు వెంకటరమణయ్య, పీవీపీ శాస్త్రి, జి. జవహర్‌లాల్, విరువింటి గోపాలకృష్ణ, ఇటీవల కొత్త తెలగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఈ శాసనంపై విస్తృత పరిశోధనలు చేశారని తెలిపారు. శాసనాన్ని చూసేందుకు పర్యాటకులు వెళ్లేలా రోడ్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
