ములుగు, సిరిసిల్లలో 90 వేల మందికి కొలెస్ట్రాల్

ములుగు, సిరిసిల్లలో 90 వేల మందికి కొలెస్ట్రాల్
  • రెండు జిల్లాల్లో 2.43 లక్షల మందికి అనారోగ్య సమస్యలు 
  • రెండు చోట్లా షుగర్ పేషెంట్లు తక్కువే 
  • చివరి దశకు హెల్త్ ప్రొఫైల్ సర్వే 
  • సర్కార్​కు నివేదిక 

హైదరాబాద్, వెలుగు: ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో 5.2 లక్షల మందికి టెస్టులు చేయగా, వారిలో 2.43 లక్షల మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తేలింది. రెండు జిల్లాల్లోనూ కొలెస్ర్టాల్ సంబంధిత సమస్యలతోనే ఎక్కువ మంది బాధపడుతున్నట్టు హెల్త్ ప్రొఫైల్ సర్వేలో వెల్లడైంది. మొత్తం 93,571 మంది బాధితులు ఉండగా, ఒక్క ములుగు జిల్లాలోనే 36.12 శాతం మందిలో కొలెస్ర్టాల్ సమస్యలు ఉండడం గమనార్హం. సర్వే నివేదికను అధికారులు ఇటీవల రాష్ట్ర సర్కార్ కు అందజేశారు. కొలెస్ట్రాల్ తర్వాత కాల్షియం లోపం, రక్త హీనత, లివర్, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ మందిలో ఉన్నట్టు సర్వేలో తేలింది. 

కొంతమందిలో ఒక్కటి కంటే ఎక్కువ సమస్యలు ఉన్నట్టు తేలింది. ములుగులో 5.6% మందికి, సిరిసిల్లలో 2.7% మందికి షుగర్ సమస్య ఉన్నట్టు వెల్లడైంది. ఇది రాష్ట్ర సగటుతో పోల్చితే చాలా తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. కిడ్నీ, లివర్ సమస్యలు ఎక్కువ మందిలో ఉండడం ఆందోళన కలిగించే అంశంగా పరిగణించాలని అంటున్నారు. 

కొనసాగుతున్న సర్వే... 

హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ ముగిసిందని సర్కార్ ఇటీవల ప్రకటించింది. కానీ రెండు జిల్లాల్లోనూ 80 నుంచి 85 శాతం మాత్రమే స్ర్కీనింగ్ పూర్తయినట్టు ఆయా జిల్లాల హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే సేకరించిన శాంపిళ్లకు సంబంధించి టెస్టుల ఫలితాలు చాలా మందికి అందలేదు. డయాగ్నస్టిక్ హబ్స్ నుంచి లబ్ధిదారుల ఫోన్లకు మెసేజ్ వెళ్లడంలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతుండడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి 30 రకాల టెస్టులు చేయిస్తుండడం కూడా ఆలస్యానికి కారణమేనంటున్నారు. మొత్తం ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఇంకో రెండు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. 

కార్డులపై బార్ కోడింగ్‌

హెల్త్ ప్రొఫైల్ కార్డుల డిజైన్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. కార్డుకు ఒకవైపు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, యూనిక్ హెల్త్ ఐడీ, బ్లడ్ గ్రూప్, ఫోన్ నంబర్‌‌ ఉంటాయి. కార్డు వెనక వైపు ఇంటి అడ్రస్‌, బార్ కోడ్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్‌‌ ఉంటాయి. బార్‌‌ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఇదే కార్డు ఇస్తారా? లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కార్డు ఇస్తారా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర సర్కార్ దేశ ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయిస్తోంది. ఈ నేపథ్యంలో స్టేట్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ఇందులో విలీనం చేసే ఆలోచన చేస్తున్నారు. ములుగు, సిరిసిల్లకు సంబంధించిన సర్వే వివరాలను కేంద్రానికి అందించారు.