ఎమ్మెల్సీ ఎన్నికల్లో 95% పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 95% పోలింగ్
  • 3 చోట్ల టీఆర్ఎస్​కు క్రాస్ ఓటింగ్ గుబులు
  • 6 సీట్లకు ముగిసిన ప్రక్రియ; 14న లెక్కింపు

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్​ పోలింగ్ ​ప్రశాంతంగా ముగిసింది. 6 స్థానాల్లో మొత్తం 95% పోలింగ్​నమోదైంది. అధికంగా కరీంనగర్​లో 99.69%, ఆదిలాబాద్​లో అత్యల్పంగా 91.78%  పోలింగ్ రికార్డయింది. ఆదిలాబాద్ లో 77 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. నల్గొండలో 38 మంది, ఖమ్మంలో 30 మంది, మెదక్​లో 8 మంది, కరీంనగర్లో నలుగురు ఓటేయలేదు. పోలింగ్​ చివరి 3 గంటల్లో చాలామంది ఓటేశారు. ఏకగ్రీవమైన 6 సీట్లు పోను ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, నల్గొండల్లో ఒక్కోటి, కరీంనగర్​లో 2 సీట్లకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఐదు జిల్లాల పరిధిలో 5,326 మంది ఓటర్లకు 37 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. క్యాంపులకు వెళ్లిన టీఆర్ఎస్ ఓటర్లంతా ఒక్కసారిగా బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఆ తర్వాతే పోలింగ్​ శాతం పెరిగింది. మూడు చోట్ల క్రాస్​ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఓటింగ్​తీరును సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 


మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ అలర్ట్ చేశారు. క్రాస్ ఓటింగ్ జరుగకుండా ఎప్పటికప్పుడు సూచనలిచ్చారు. అయినా కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు క్రాస్​ఓటింగ్​చేసినట్లు తెలిసింది. నిజానికి ఈ క్రాస్ ఓటింగ్ భయంతోనే నోటిఫికేషన్​వచ్చినప్పటి నుంచే టీఆర్ఎస్ క్యాంపులు షురూ చేసింది. ఓటర్లను పలు రాష్ట్రాలలో 20 రోజులకు పైగా రిసార్టులు, హోటళ్లలో పెట్టింది. పోలింగ్​కు రెండ్రోజుల ముందు హైదరాబాద్ దగ్గరలోని రిసార్టులకు తరలించింది. శుక్రవారం మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారిని నేరుగా పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో తీసుకెళ్లారు. ఓటర్లు ఫోన్లలో కూడా మాట్లాడకుండా కట్టడి చేశారు. చివరిదాకా కాపలా కాశారు.
14న ఉదయం 8కి లెక్కింపు: సీఈవో
పోలింగ్​ప్రశాంతంగా ముగిసిందని సీఈఓ శశాంక్​గోయల్ శుక్రవారం మీడియాకు చెప్పారు. ఎక్కడ ఇబ్బందులు రాలేదన్నారు. ‘‘పోలీస్ బందోబస్తుతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములకు  తరలించాం. అక్కడ సీసీ కెమెరాల నిఘా, బందోబస్తు ఉంటుంది. అభ్యర్థులకు అనుమానాలుంటే స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా పెట్టుకోవచ్చు. 14న లెక్కింపు ఉంటుంది. ఫలితాలొచ్చాక విజేతలు ర్యాలీలు చేయొద్దు” అని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఓటేయలే
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేయలేదు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్ మెదక్ లో తన ఓటు హక్కు ఉపయోగించుకోలేదు. మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఓటు హక్కు లేకపోవడంతో ఆయనా ఓటేయలేదు. టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చాక ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం, లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టు ప్రకటన నాటికి తిరిగి గెలవకపోవడం వల్ల ఓటేయలేదని తెలిసింది.  బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటుకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఓటేయలేదు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇబ్రహీంపట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా నమోదు చేసుకోవడంతో నల్గొండలో ఆయనకు ఓటు హక్కు లేదు.
ఆ మూడు చోట్ల రసవత్తరం
ఉమ్మడి కరీంనగర్ లో రెండు సీట్లలో టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, భాను ప్రసాదరావు పోటీ చేశారు. మాజీ మేయర్ రవీందర్​ సింగ్, ఎంపీపీ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్లుగా బరిలో దిగడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. 1,324 మంది ఓటర్లుండగా, 8 పోలింగ్​ కేంద్రాల్లో 1320 మంది ఓటు వేశారు. చిగురుమామిడి మండలం రేగొండ ఎంపీటీసీ చాడ శోభ(సీపీఐ) కాలికి సర్జరీ జరగ్గా  స్ట్రెచర్‌‌పై వచ్చి ఓటేశారు. 99.7 శాతం పోలింగ్ నమోదైంది. రూలింగ్​పార్టీ ఓటర్లు క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకే వచ్చారు. టీఆర్ఎస్ ఓటర్లు గులాబీ కండువాలతో రావడం పట్ల రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎవరో చెబితే తమను అడ్డుకోవడం ఏమిటని అక్కడున్న డీసీపీ పై  మంత్రి గంగుల కమలాకర్ ఫైరయ్యారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​రావు, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫారుఖ్​హుసేన్, జిల్లా ఎమ్మెల్యేలు ఓటేశారు.102 ఓటర్లకు గాను 99 ఓటేయగా యాక్ట్ కింద చంచల్​గూడ  జైల్లో ఉన్న భైంసా కౌన్సిలర్లు అబ్దుల్ ఖాదర్, విజయ్‍ పోస్టల్ బ్యాలెట్ వాడుకున్నారు. తుడుం దెబ్బ తరపున పోటీ చేస్తున్న ఇండిపెండెంట్​పుష్ప తరపున పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించిన బీజేపీ లీడర్​ లోక ప్రవీణ్ రెడ్డి పోలింగ్ కేంద్రం దగ్గర అటూఇటూ తిరుగుతుండటంపై టీఆర్​ఎస్​ నేతలు కంప్లైంట్​ చేశారు. బయటకు వెళ్లాలని ప్రవీణ్ పై పోలీసులు ఒత్తిడి పెట్టారు. డీఎస్పీతో ప్రవీణ్​ వాదనకు దిగగా.. పోలీసులు అతన్ని నెట్టేశారు. బీజేపీ లీడర్లు కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ దృష్టికి తీసుకెళ్లగా ఆమె వారిని సముదాయించారు. బేల మండలానికి చెందిన ఓటర్లు  ఎంపీడీఓ వెహికల్​లో పోలింగ్ కేంద్రానికి రావడాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఆందోళన చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ లీడర్లు ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్​ అయ్యారు. ఎన్నికల్లో పాల్గొనొద్దని సీపీఎం, న్యూ డెమోక్రసీ నిర్ణయించినా కూసుమంచి, బోనకల్ మండలాలకు చెందిన 10 మంది సీపీఎం ఎంపీటీసీలు ఓటేసినట్టు తెలుస్తోంది.

ఓటింగ్​ఇలా...
ఆదిలాబాద్ జిల్లాలో 947 మందికిగాను 860 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 91.78శాతం పోలింగ్ నమోదైంది.ఖమ్మంలో 768 మందికిగాను 738 మంది ఓటు వేయగా 90.09 శాతం, మెదక్ లో 1,026 మందికిగాను 1,018 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 99.22 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ లో 1,234 మంది ఓటర్లకు గాను 1,230మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగా 99.69శాతం నమోదైంది. నల్గొండలో 1,271 మంది ఓటర్లకు గాను 1,233 మంది ఓటు వేయగా 97.01శాతంగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఓటర్లు మొత్తం 937 మంది ఉండగా 860 మంది మాత్రమే ఓటు వేశారు. మిగతా 77 మంది ఓటు హక్కు వినియోగిం చుకోలేదు. ఏఐసీసీ నాయకుడు ప్రేంసాగర్ ఎన్నికలను బహిష్కరిం చాలని ఇచ్చిన పిలుపు మేరకే మంచిర్యాల, బెల్లంపల్లికి చెందిన కాంగ్రెస్ స్థానిక సంస్థల సభ్యులు ఓటు వేయలేదు. 37 పోలింగ్ కేంద్రాలకు గాను 9 కేంద్రాల్లో 100 శాతం  పోలింగ్ నమోదైంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ . మెదక్ జిల్లా జహీరాబాద్, నారాయణ ఖేడ్, సిద్దిపేట జిల్లాలో తూప్రాన్, ఆదిలాబాద్ లో నిర్మల్, నల్గొండలో భువనగిరి  పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. 

క్రాస్‌ ఓటింగ్‌ ఎఫెక్టెంత? 

పోలింగ్​పై సీఎం నజర్

హైదరాబాద్‌, వెలుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మేరకు క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది, టీఆర్ఎస్ క్యాండిడేట్లపై దాని ఎఫెక్ట్​ ఎంత ఉంటుందని పార్టీ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పోలింగ్ జరుగుతున్న జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ తో టచ్ లో ఉంటూ గడిపారు. ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం ఎంత ఉందని ఆరా తీశారు. క్యాంపుల నుంచి ఓటర్ల తరలింపు నుంచి ఏ టైముకు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్నారు వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్‌లో తుడుం దెబ్బ ప్రభావం, కరీంనగర్‌లో టీఆర్ఎస్ రెబల్‌కు బీజేపీ మద్దతు నేపథ్యంలో అక్కడి పరిస్థితి ఎలా ఉందంటూ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఖమ్మంలో సొంత పార్టీ నుంచి ప్రతికూలత ఎదురవుతుందా అనేదానిపైనా సమాచారం సేకరించారు. పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి ముగిసేదాకా ఏ జిల్లాలో పరిస్థితి ఏంటని ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకున్నారు. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తుడుందెబ్బ బరిలో దింపిన ఇండిపెండెంట్‌ ప్రభావం ఎంత, టీఆర్‌ఎస్‌ ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారా అంటూ ఆరా తీశారు.
కరీంనగర్​పైనే ఫోకస్​
కరీంనగర్‌లో లో మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రభుత్వంపై, సిట్టింగ్‌ ఎమ్మెల్సీపై వ్యతిరేకంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఆయనకు బహిరంగ మద్దతు తెలిపింది. వీరితో పాటు కాంగ్రెస్‌ ఓటర్లలో ఎందరు ఆయనకు అండగా నిలిచారు, టీఆర్ఎస్ నుంచి ఆయనకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌ జరిగిందా అని కేసీఆర్​ఆరా తీశారు. ఏ సెగ్మెంట్లో రవీందర్ సింగ్ కు టీఆర్‌ఎసోళ్లు ఓటేశారనే సమాచారం తీసుకున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ  కొందరు సొంత పార్టీ నేతలు టీఆర్​ఎస్​ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారని కేసీఆర్ అంచనాకు వచ్చినట్టు చెబుతున్నారు.