హైదరాబాద్ సిటీ, వెలుగు: జల సంరక్షణలో ‘జల్ సంచయ్ జన భాగిదారి’ జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన 6వ నేషనల్ వాటర్ అవార్డ్స్ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును దక్కించుకున్న సందర్భంగా అశోక్ రెడ్డిని సీఎం అభినందించారు. వాటర్ బోర్డుకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్ వినోద్ భార్గవ ఉన్నారు.
