గోదావరి ఉధృతి కాస్త తగ్గినా.. భద్రాచలం చుట్టుపక్కల ఏరియాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద శనివారం ఉదయం 71.3 అడుగులకు చేరిన నీటి మట్టం.. సాయంత్రం కల్లా 68.60 అడుగులకు తగ్గింది. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతంలోని 95 గ్రామాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. 10 వేల ఇండ్లు ముంపునకు గురయ్యాయి. 77 పునరావాస కేంద్రాల్లో 20,922 మంది బాధితులు తలదాచుకుంటున్నారు. ముంపు మండలాలకు ఇంకా కరెంటు సరఫరా కావడంలేదు.
ఇప్పుడే ఇండ్లకు వెళ్లొద్దు.. షెల్టర్లలోనే ఉండండి: మంత్రి పువ్వాడ
భద్రాచలం : పోటెత్తి ప్రవహించిన వరద గోదావరి కాస్త శాంతించింది. శనివారం తెల్లవారుజామున గరిష్టంగా 71.3 అడుగులకు చేరిన నీటి మట్టం.. మెల్లగా తగ్గుతూ వచ్చింది. సాయంత్రం 6 గంటలకు 68.60 అడుగుల వద్ద ప్రవహిస్తున్నది. గోదావరికి వరద తగ్గినా ఇప్పుడే గ్రామాలకు వెళ్లొద్దని, పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతంలోని 7 మండలాల్లో 95 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. 10 వేల ఇళ్లు ముంపునకు గురయ్యాయి. 77 పునరావాస కేంద్రాల్లో 20,922 మంది బాధితులు తలదాచుకుంటున్నారు. ముంపు మండలాలకు ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, వెంకటాపురం మండలంలోని ఆలుబాక సబ్ స్టేషన్లు ఇంకా ముంపులోనే ఉండటంతో ఈ మండలాలకు విద్యుత్ సరఫరా మొదలుకాలేదు.
వెయ్యి మంది వరద బాధితుల ధర్నా
కరకట్టలు ఎత్తుగా, రివిట్‌మెంట్‌తో కట్టాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం సుభాష్‌నగర్ కాలనీవాసులు విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. సుమారు 1,000 మంది బాధితులు ధర్నాకు దిగారు. పోలీసులు, ఆఫీసర్లు తమను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేవలం గెస్ట్ హౌస్‌కే పరిమితమయ్యారని, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. తమను ఇండ్లకు పోనీయడం లేదని, ఇండ్లలోకి దొంగలు దూరి వస్తువులు ఎత్తుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య వచ్చి ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించారు. టీఆర్ఎస్ సర్కారుపై ఆయన విమర్శలు చేయడంతో రాజకీయ సభ కాదంటూ సీపీఎం శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తమ సమస్య పక్కదారి పడుతున్నదంటూ కాంగ్రెస్, సీపీఎం లీడర్లను వరద బాధితులు పంపించేశారు. తమ ఇండ్లలోకి వెళ్లేందుకు వరద బాధితులు ప్రయత్నించగా పోలీసులు ఆపేశారు. నీళ్లలోనే కొద్దిసేపు ఆందోళన చేశారు.
మొరాయించిన మోటార్లు
భద్రాచలం టౌన్‌లో కరకట్ట స్లూయిజ్‌ల ద్వారా లీక్ అవుతున్న వరద నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు మొరాయించాయి. మోటార్లు మునిగిపోవడంతో ఇరిగేషన్ ఆఫీసర్లు నీటిని తోడటం ఆపేశారు. దీంతో డ్రైన్, లీక్ వాటర్ మొత్తం రామాలయం ఏరియాలో విస్తరిస్తోంది. ముంపు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉండే వరద బాధితులకు భోజనాలు సరిగా పెట్టడం లేదు. గోదావరి వరద దృష్ట్యా భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించడంతో నిత్యావసర సరుకుల ధరలను భారీగా పెంచారు.
