మిల్లర్లకు ఆఫీసర్ల అండ.. సీఎంఆర్​ పక్కదారి

మిల్లర్లకు ఆఫీసర్ల అండ.. సీఎంఆర్​ పక్కదారి
  • హుస్నాబాద్​లో 9,523 మెట్రిక్​ టన్నుల ధాన్యం మాయం 

హుస్నాబాద్​, వెలుగు: రైతులకు సర్కారు మద్దతు ధర ఇచ్చి కొంటున్న వడ్లను మిల్లర్లు అక్రమంగా అమ్ముకుంటున్నారు. సివిల్​ సప్లయ్​ ఆఫీసర్ల అండతోనే  సర్కారుకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఏఆర్ఎం ఆగ్రోస్​ ఇండస్ట్రీస్​ యజమాని 9,523 మెట్రిక్​ టన్నుల వడ్లను మాయం చేసినట్టు తేలింది. ప్రభుత్వం 2021‌‌‌‌లో వానాకాలం, యాసంగి సీజన్​లో ఈ మిల్లుకు 11,427 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయించింది. మిల్లు యజమాని 2 వేల మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే బియ్యంగా మరాడించి సీఎంఆర్ కింద పౌర సరఫరాల సంస్థకు అప్పగించాడు. మిగితా 9,523 మెట్రిక్ టన్నుల వడ్లను బియ్యంగా చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్టు తేలింది.  దీని విలువ రూ.27.76 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. సర్కారు ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో కొన్న వడ్లను సివిల్ సప్లై ద్వారా మిల్లింగ్‌‌కు ఇస్తోంది. మిల్లింగ్ అనంతరం మిల్లర్లు వడ్లను సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌‌సీఐకి, స్టేట్ పూల్ కింద రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా వాటిని ఎక్స్ పోర్ట్ చేసుకుంటున్నారు. సీఎంఆర్ లెక్క కోసం రేషన్ బియ్యాన్ని చూపిస్తున్నారు. ఇందుకోసం గ్రామాలు, మండల కేంద్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని రేషన్​ బియ్యాన్ని కొంటున్నారు. వాటిని పాలిష్ చేసి ఎఫ్‌‌సీఐ, స్టేట్ పూల్‌‌కు అప్పగిస్తున్నారు. సీఎంఆర్ పూర్తి స్థాయిలో రికవరీ కాకపోవడానికి కూడా ఇదొక కారణం. సీఎంఆర్ జాప్యమవుతున్నా సివిల్ సప్లై ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితిలో జరిమానాలు విధిస్తున్నా మిల్లర్లు వాటిని బేఖాతరు చేస్తున్నారు.

తేలని  లెక్కలు

మిల్లులకు ఇచ్చిన వడ్ల లెక్కలు ఎంతకూ తేలడం లేదు. సీఎంఆర్ ఆలస్యంతో తనిఖీలు చేపడుతున్న ఆఫీసర్లకు పూర్తిస్థాయిలో వడ్ల లెక్కలు తెలియడం లేదు.  మూడు సీజన్ల నుంచి సీఎంఆర్ లెక్కలు తేలకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.  అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటే ఈ దందాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉన్నా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. మిల్లర్లకు కేటాయించిన వడ్లను అక్రమంగా అమ్ముకొని, లెవీ కింద రేషన్‍బియ్యాన్ని ఇస్తున్నారని తెలిసినా, అటు రేషన్​ బియ్యం అమ్మకాలను ఆపడం లేదు. వడ్లను గడువులోగా మిల్లు ఆడించి ఎఫ్​సీఐ, సివిల్ సప్లై గోడౌన్లకు తరలించకుండా ఇతర జిల్లాల్లోని మిల్లులకు తరలించి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకొని పీడీఎస్ బియ్యాన్ని కొంటూ, వాటిని పాలిష్ చేసి ఎఫ్​సీఐ, సివిల్ సప్లై గోడౌన్లకు తరలిస్తున్నారు. ఇదే బియ్యం మళ్లీ గ్రామాల్లో రేషన్ దుకాణాలకు చేరుకుంటున్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వల్ల, నిల్వ ఉన్న వడ్లకు,  సీఎంఆర్‍కింద ఇచ్చిన బియ్యానికి లెక్క తేలడం లేదు. మిల్లు ఆడించి బియ్యాన్ని గోడౌన్లకు పంపించడానికి మిల్లర్లకు కొంత సమయం ఇస్తున్నారు. ఈ సమయంలో సివిల్ సప్లై అధికారులు, ఎఫ్​సీఐ ఆఫీసర్లు పర్యవేక్షించడం లేదు. దీన్ని అదునుగా తీసుకుంటున్న మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. 2021–22 వానాకాలం, యాసంగి సీఎంఆర్ అప్పగించడానికి మార్చి నెలాఖరుతో గడువు ముగియగా, ఇంకా ఈ రెండు సీజన్లకు సంబంధించి లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉన్నాయి. హుస్నాబాద్​లోని ఏఎంఆర్​ ఆగ్రో ఇండస్ట్రీస్​ యజమాని ప్రభుత్వానికి బియ్యాన్ని ఇవ్వకుండా అక్రమంగా అమ్ముకున్నాడని తేలింది. దీన్ని సర్దుబాటు చేసుకునేందుకు చాలా రోజుల నుంచి ఆఫీసర్లు, ఆయనకు మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయినా లెక్క తేలకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో విజిలెన్స్​ ఆఫీసర్లతో మిల్లుపై దాడులు చేశారు. అయితే సదరు వ్యాపారి ఈ అక్రమాన్ని సక్రమం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ ఆఫీసర్లు తన మిల్లులో వసతులు లేకున్నా బలవంతంగా  వడ్లు కేటాయించారని, అవి వానకు తడిసి పాడైపోయినట్లు  క్రియేట్​ చేసుకుంటున్నాడని అంటున్నారు. దీనిపై ఆఫీసర్లు స్పందించాల్సి ఉంది.