
- 4 రోజుల్లో 4 వేల అప్లికేషన్లు
- నిరుడు 65 ఏటీసీలు మంజూరు
- రాష్ట్ర ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లకు (ఏటీసీ) మంచి స్పందన వస్తోంది. పదో తరగతి అర్హతతో ఈ ఏడాది మే నెలలో పలు కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వగా 96 శాతం సీట్లకు అప్లికేషన్లు వచ్చాయని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ర్టంలో మొత్తం 65 ఏటీసీలు ఉండగా ఒక్కో ఏటీసీలో 172 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కోర్సులు కలిపి మొత్తం 22,222 సీట్లు ఉండగా 21,935 సీట్లు ఫిల్ అయ్యాయి. అలాగే, తరగతులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇటీవల రెండో దశ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా ఈ నెల 31 వరకు గడువు ఉంది. 4 రోజుల్లో 4 వేలకుపైగా అప్లికేషన్లు రాగా.. సెప్టెంబరు నుంచి క్లాస్ లు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఐటీఐల్లో కూడా 8వ తరగతి అర్హతతో పలు కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలు కలిపి సుమారు 300కి పైగా ఉండగా ఇందులో 80 వేల వరకు సీట్లు ఉన్నాయి.
ఏటీసీలు, ఐటీఐల్లో ఇవి కోర్సులు
ఏటీసీల్లో ప్రధానంగా తొలి దశలో 6 కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్ టెక్నీషియన్ ఏడాది కోర్సు (20 సీట్లు), మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమిషన్ ఏడాది కోర్సు (40 సీట్లు), ఇండస్ర్టీయల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ ఏడాది కోర్సు (40 సీట్లు), వర్చువల్ వెరిఫైర్ డిజైన్ (ఎఫ్ఈఎం) రెండేళ్ల కోర్సు (24 సీట్లు), మెకానిక్, ఎలక్ర్టిక్ వెహికిల్ రెండేళ్ల కోర్సు (24 సీట్లు), సీఎన్సీ మెకానిక్ టెక్నీషియన్ రెండేళ్ల కోర్సు (24 సీట్లు) అందిస్తున్నారు. వీటితోపాటు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, టర్నర్, కంప్యూటర్, కోపా (కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్) మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ డ్రాఫ్ట్‌మ్యాన్, మెకానిక్, వెల్డర్, హెల్త్ అండ్ సానిటరీ ఇన్‌స్పెక్టర్, కట్టింగ్, డ్రెస్ మేకింగ్ కోర్సులు కూడా అందిస్తున్నారు.
ఇటీవల 40 ఏటీసీలకు కేంద్రం అనుమతి
రాష్ర్ట ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్తంగా కలిపి రాష్ర్టంలో ఏటీసీలను నెలకొల్పాయి. అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఏటీసీ నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని మల్లేపల్లిలో ఏటీసీని ప్రారంభించారు. రాష్ర్టంలో ఏర్పాటు చేయనున్న 65 ఏటీసీలకు శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,324 కోట్లు ఖర్చుచేస్తోంది. వీటిలో ఇప్పటి వరకు 25 ఏటీసీల నిర్మాణం పూర్తికాగా, మిగతావి చివరి దశకు చేరకున్నాయి. కార్మిక శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి మరో 46 నియోజకవర్గాల్లో ఏటీసీలకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. రూ.2,076 కోట్లతో ఆ ఏటీసీలను నిర్మించనున్నారు. వీటి ఆమోదం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా స్కిల్ డెవప్ మెంట్ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది నుంచి తరగతులు కూడా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.