ఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మంది మృతి

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మంది మృతి
  • కొనసాగుతున్న కరోనా స్వైర విహారం
  • ఇవాళ 21 వేల 320 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. లాక్ డౌన్ పెట్టి కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కరోనా మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రికవరీ అయి ఇళ్లకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఊరట కలిగిస్తున్నా ఇంకోవైపు పెరుగుతున్న మరణాలు కలవరపెడుతున్నాయి. 
గడచిన 24 గంటల్లో 91 వేల 253 మందికి కరోనా పరీక్షలు చేయగా 21 వేల 320 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే 99 మంది చనిపోయారు. అత్యధికంగా చిత్తూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో పది మంది చొప్పున, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 9 మంది చొప్పున, అనంతపురం, గుంటూరు, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, నెల్లూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున కన్నుమూశారు. 
జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలను పరిశీలిస్తూ అనంతపురం జిల్లాలో 2804 మందికి, చిత్తూరు జిల్లాలో 2630 మందికి, తూర్పు గోదావరి జిల్లాలో 2923 మందికి, గుంటూరు జిల్లాలో 1291 మందికి, కడప జిల్లాలో 1036 మందికి, కృష్ణా జిల్లాలో 1048 మందికి, కర్నూలు జిల్లాలో 991 మందికి, నెల్లూరు జిల్లాలో 1251 మందికి, ప్రకాశం జిల్లాలో 785 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 1466 మందికి, విశాఖపట్టణం జిల్లాలో 2368 మందికి, విజయనగరం జిల్లాలో 965 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 1762 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
అలాగే గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 21 వేల 274 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయి వెళ్లినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇవాళ్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1 కోటి 81 లక్షల 40 వేల 307కు చేరుకుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది.