పోడు రైతులను ఇబ్బంది పెట్టేందుకు టీషర్ట్ చింపుకొని

పోడు రైతులను ఇబ్బంది పెట్టేందుకు  టీషర్ట్ చింపుకొని
  • టీ షర్ట్ చింపుకొని పోడు రైతులపై ఫిర్యాదు 
  • ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 
  • ఫారెస్ట్ ​బీట్ ఆఫీసర్ ​నిర్వాకం

ఖమ్మం, వైరా, వెలుగు: పోడు రైతులను ఇబ్బంది పెట్టేందుకు తనకు తానుగా టీషర్ట్ చింపుకొని, పోడు సాగును ఆపినందుకు తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడో అటవీ శాఖ బీట్ ఆఫీసర్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్​లో మంగళవారం పోడు భూముల్లో ఎద్దులతో దుక్కి దున్నుతున్న కొంత మంది రైతులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సిబ్బంది, స్థానిక గిరిజనులకు మధ్య కొంత వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సమయంలో బీట్ ​ఆఫీసర్ చంద్రశేఖర్​నాయక్ తన టీషర్ట్ తానే చింపుకోవడం స్థానికులు సెల్ ఫోన్​లో రికార్డు చేశారు. తర్వాత ఉద్రిక్తత సద్దుమణగ్గా..పోడు సాగును అడ్డుకున్నందుకు తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు బీట్​ ఆఫీసర్ ​కంప్లయింట్ ​చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని కొణిజర్ల పోలీసులు చెబుతున్నారు. గతేడాది ఇదే ఎల్లన్ననగర్​లో 22 మంది తమపై దాడి చేశారంటూ అటవీ శాఖ సిబ్బంది కంప్లయింట్​ చేయగా, పోలీసులు హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, ముగ్గురు బాలింతలతో పాటు పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మళ్లీ అదే గ్రామంలో తాజాగా పోడు గొడవ జరిగింది.