విజయవాడ: పారిశ్రామిక అవసరాలకు తగినట్లు యువత సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం సరోజా వివేకానంద అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మంగళవారం (జనవరి 27) నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నైపుణ్యం అంటే నీటిలో పడినా ఒడ్డుకు చేరడమేనని అన్నారు.
పరిశ్రమలు విద్యాలయాలకు వచ్చి వారి అవసరాలకు తగినట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ పూర్తి ప్రత్యామ్నాయం కాదని, విద్యార్థులు జీవిత చరిత్రలు, వ్యక్తిత్వవికాస రచనలు చదవాలని సూచించారు. ‘మీ అనుభవాలను ఎప్పటికప్పుడు రాస్తూ ఉండాలి.
ఇంగ్లిష్ భాష నైపుణ్యం పెంచుకోవాలి. పని గంటల పరిమితి లేకుండా బాగా శ్రమిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. నేర్చుకోవడం ప్రతి దశలోనూ కీలకం. విద్యార్థినులు బిడియపడకూడదు” అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సరోజ సమాధానాలు ఇచ్చారు. ఉపాధిపై, ఉన్నతవిద్యపై ఆమె అవగాహన కలిగించారు.
