
జూలూరుపాడు: పిల్లలు ఆటలు ఆడుకునే సమయంలో కొట్టుకోవడం మామూలే. అయితే పేరెంట్స్ బుజ్జగించడంతో ఇతర పిల్లలతో గొడవలైనా మళ్లీ వాళ్లతో కలసి ఆడుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇలాంటి గొడవలు పెరిగి పెద్దగా అవుతాయి. పోలీసు స్టేషన్ల వరకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడులో జరిగింది. న్యూ కాలనీకి చెందిన కాశిమళ్ల రవిబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన 14 ఏళ్ల కుర్రాడు అతడి తలపై కొట్టాడు. దీంతో బాలుడు ఏడుస్తూ నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఓ పిల్లాడు తన తలపై కొట్టాడని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో తానే నేరుగా స్టేషన్‌కు వచ్చానని బాలుడు తెలిపాడు. దీంతో ఒక హోంగార్డు స్కూలుకు వెళ్లి రవిబాబును కొట్టిన కుర్రాడికి సర్దిచెప్పారు.