ధనిక రాష్ట్రంలో 71% పేదలే

ధనిక రాష్ట్రంలో 71% పేదలే
  • సర్కారు చెప్పిన రేషన్ కార్డుల లెక్కల్లో వెల్లడి
  • 4 కోట్ల జనాభాలో 2.87 కోట్ల మంది పేదరికంలోనే
  • ఏడేండ్లలో 21.30 లక్షల మంది పేదలు పెరిగిన్రు
  • మొత్తం రేషన్ కార్డుల  సంఖ్య 90.49 లక్షలు
  • రాష్ట్రం వచ్చాక 6.70 లక్షల కార్డులు


రాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఏటా రేషన్‌‌‌‌ కార్డులకు దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2014 వరకు తెలంగాణలో  83.89 లక్షల రేషన్​ కార్డులు ఉండగా.. ఈ లబ్ధిదారుల సంఖ్య 2.66 కోట్లు. 2014 నుంచి 2016 వరకు రేషన్‌‌‌‌ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు అప్లయ్‌‌‌‌ చేసుకోగా 2016లో సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ 94,417 కార్డులను అందించింది. మొత్తం ఈ ఏడేండ్లలో 6.70 లక్షలకు పైగా కార్డులు ఇచ్చినట్లు సర్కారు ప్రకటించింది. ఈ కార్డులు కలిగిన పేద కుటుంబాల జనాభా 21.30 లక్షలు అని పేర్కొంది. 

హైదరాబాద్, వెలుగు: ఒక వైపు మనది ధనిక రాష్ట్రమని ప్రభుత్వ పెద్దలు చెప్తుంటే... మరో దిక్కు రాష్ట్రంలో పేదల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. రేషన్‌‌ కార్డుల లెక్కలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతున్నది. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్​) 71 శాతం మంది ఉన్నట్లు రేషన్​ లబ్ధిదారుల వివరాలు చెప్తున్నాయి. గత ఏడేండ్లలోనే 21.30 లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. జీఎస్‌‌డీపీలో దేశంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని,  సర్​ప్లస్‌‌ స్టేట్‌‌ అని ఆర్థిక శాఖ చెప్పే లెక్కలకు, సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ జారీ చేసే రేషన్‌‌ కార్డులకు పొంతన కుదరడం లేదు. గురువారం అసెంబ్లీలో మంత్రి గంగుల కమలాకర్‌‌  రేషన్‌‌ కార్డుల వివరాలు ప్రకటించారు. 
2.87 కోట్ల మంది రేషన్‌‌ లబ్ధిదారులు
రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్ల వరకు ఉండగా.. రేషన్‌‌ కార్డులు 90.49 లక్షలు ఉన్నాయి.  2 కోట్ల 87 లక్షల 68 వేల మంది రేషన్‌‌ లబ్ధిదారులు ఉన్నట్లు సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రకటించింది.  బీపీఎల్​లో ఉన్న వారికే రేషన్‌‌ కార్డులు ఇస్తారు. గ్రామాల్లోనైతే లక్షన్నరలోపు సంవత్సరాదాయం, పట్టణ ప్రాంతాల్లోనైతో రూ. 2 లక్షలలోపు 
సంవత్సరాదాయం ఉన్న కుటుంబాలు రేషన్‌‌ కార్డులకు అర్హులు. దీని ప్రకారం.. రేషన్​ కార్డులున్న 90.49 లక్షల కుటుంబాలు పేదవర్గాలే. అంటే ఈ కుటుంబాల్లోని 2 కోట్ల 87లక్షల 68వేల మంది పేదరికంలో మగ్గుతున్నారు. రాష్ట్ర జనాభాలో వీళ్లు 71 శాతం ఉన్నారు.