
బరేలీ : పెళ్లి వేదికపై వరుడు తనకు ముద్దుపెట్టాడని పెళ్లి క్యాన్సిల్ చేసింది ఓ వధువు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంభాల్‌లో మంగళవారం రాత్రి జరిగింది.
దాదాపు 300 మంది అతిథుల సమక్షంలో ఓ జంటకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి వేడుకకు ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇరువురూ పూల దండలు మార్చుకున్నారు. ఇంతలోనే వేదికపై ఉన్న వరుడు.. వధువుకు ముద్దుపెట్టాడు. ఎలాగో కాబోయే భార్యే కదా అని అనుకున్నాడో ఏమో బంధువుల సమక్షంలోనే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కోపంతో ఊగిపోయిన పెళ్లికూతురు అక్కడి నుంచి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కాబోయే భర్త వేదికపైనే అందరి ముందు ముద్దుపెట్టి.. అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. స్టేజీపైనే పెళ్లికొడుకు ముద్దుపెట్టుకోవడంతో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో వివాహం రద్దయ్యింది.
పెళ్లికూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు ఇరువర్గాలను స్టేషన్ కు పిలిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్నారు. చివరకు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించారు. కానీ.. వధువు ఒప్పుకోలేదు. అంతకుముందు.. వరుడు తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ బెట్టు కట్టాడు. పెళ్లి కుమార్తెను స్టేజ్ మీదే ముద్దు పెట్టుకుంటానని ఆ బెట్టు. దీంతో అనుకున్నట్లుగానే పెళ్లి కూతుర్ని దండలు మార్చుకోగానే ముద్దు పెట్టేశాడు. దీంతో విషయం గ్రహించిన పెళ్లి కూతురు దీన్నో అవమానంగా భావించింది. కాబోయే భర్త ముద్దు పెట్టడం తప్పుకాదని, కానీ ఫ్రెండ్స్ తో పందెం కట్టి, దాన్ని నెగ్గేందుకు తనను పబ్లిగ్గా ముద్దు పెట్టడం సరికాదని భావించింది.
పెళ్లికాకముందే అందరి సమక్షంలో తనతో పెళ్లికొడుకు అనుచితంగా ప్రవర్తించాడని, ఒకవేళ పెళ్లి అయిన తర్వాత తనతో ఎలా ఉంటాడోనని వధువు ఆందోళన వ్యక్తం చేసింది. చేసేదేమీ లేక పోలీసులు ఇరు వర్గాలకు రెండు రోజుల సమయం ఇచ్చారు. ఈ లోపు వధువు తన మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకుంటుందనే ఆలోచనతో కొంత గడువు ఇచ్చారు.