పట్టా పాస్​బుక్​లు చేయిస్తానని 10 లక్షలు స్వాహా

పట్టా పాస్​బుక్​లు చేయిస్తానని 10 లక్షలు స్వాహా

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: పట్టాదారు పాస్ పుస్తకాలు చేయిస్తానని రైతులను నమ్మించి ఓ దళారీ రూ.10 లక్షలు స్వాహా చేశాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన దళారి మాచినేని శరత్​అన్నపురెడ్డిపల్లి కొత్త మండలంగా ఏర్పడ్డ నాటి నుంచి రెవెన్యూ శాఖ ఆఫీసర్లతో సన్నిహితంగా మెలిగేవాడు. గతంలో పని చేసిన పలువురు తహసీల్దార్ల  ట్రాన్స్​ఫర్, ప్రమోషన్ల టైంలో రైతుల నుంచి ఎకరానికి రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేసి తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టా పాస్​పుస్తకాలు చేయిస్తానంటూ రెండేళ్ల క్రితం పెంట్లం రెవెన్యూ పరిధిలోని ఏడుగురు రైతుల దగ్గర రూ.10 లక్షల వరకు శరత్ వసూలు చేశాడు.  ఏజెన్సీ రూల్స్ ప్రకారం 1970 కంటే ముందు కొన్నట్లు అగ్రిమెంట్లు రాయించి పట్టాదారు పాస్​ పుస్తకాలు చేయిస్తానని నమ్మబలికాడు. ధరణి పోర్టల్ అమలు కావడంతో పట్టా చేయించేందుకు వీలు కాలేదు. మొదట్లో రైతులకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. ఏడాది గడిచిన తర్వాత డబ్బులు ఇవ్వనని, దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధిత రైతులు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.