2047 నాటికి నం.1 ఎకానమీగా భారత్ : చంద్రబాబు

2047 నాటికి నం.1 ఎకానమీగా భారత్  : చంద్రబాబు
  • తెలుగు రాష్ట్రాలూ 1, 2 స్థానాల్లో ఉండాలి: చంద్రబాబు 

చేవెళ్ల/హైదరాబాద్, వెలుగు:  భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, రెండేండ్లలో మూడో స్థానానికి, 2038లో రెండో స్థానానికి, 2047 నాటికి నెంబర్ వన్ ఎకానమీగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను 2000లో విజన్​2020ని రిలీజ్ చేస్తే అందరూ నవ్వారని, కానీ ఈ రోజు అంతకంటే బెటర్​గా హైదరాబాద్ తయారైందన్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047ను రెడీ చేశామని, తెలంగాణలోనూ తయారు చేస్తున్నారని.. రెండు రాష్ట్రాలు దేశంలో నెంబర్1, 2 గా ఉండాలని ఆకాంక్షించారు. 

శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని గండిపేట వద్ద ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్​ఇన్‌‌స్టిట్యూషన్స్ వార్షిక వేడుకల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం (గండిపేట) ఒకప్పుడు పార్టీ హెడ్ క్వార్టర్ అని.. ఎన్టీఆర్, తాను ఇక్కడే పని చేశామని చెప్పారు. 25 ఏళ్లలో దేశంలో అత్యధిక తలసరి ఆదాయానికి తెలంగాణ చిరునామాగా మారిందంటే అప్పటి తన నిర్ణయమే కారణమని చంద్రబాబు పేర్కొన్నారు.