- నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేసినందుకు గత ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయించిందని మంత్రి సీతక్క వెల్లడించారు. 2020లో కరోనా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నమోదైన కేసు విచారణలో భాగంగా మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర నేతలు శనివారం నాంపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు.
కేసు విచారణలో భాగంగా కోర్టు.. క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేసినందుకే గత ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని గుర్తుచేశారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నామంటూ తమపై అభియోగాలు మోపడం అన్యాయమని పేర్కొన్నారు. కరోనా నిబంధనల ఉల్లంఘన జరగలేదని కోర్టుకు తమ న్యాయవాదులు స్పష్టంగా వివరించారని మంత్రి తెలిపారు. తమ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసిందని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని సీతక్క చెప్పారు.
