
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్‌షీట్‌ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా..? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా..? అనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు అవి ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
టెన్త్ జావాబు పత్రాల మిస్సింగ్ పై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. పోస్టల్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే జవాబు పత్రాలు మిస్ అయ్యాయని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత ప్రకటించారు. ఆన్సర్ షీట్ బండిల్ మాయంపై వివరాలు సేకరిస్తోంది విద్యాశాఖ. కనిపించకుండా పోయిన జవాబు పత్రాలు సప్లిమెంటరీ విద్యార్థులవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే పోస్టల్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్సర్ షీట్ మిస్సింగ్ లో విద్యాశాఖ తప్పిదం లేదని డీఈవో ప్రణీత చెప్పారు.