అంబర్ పేట లో వ్యాపారి కిడ్నాప్

అంబర్ పేట లో వ్యాపారి కిడ్నాప్

అంబర్ పేట, వెలుగు: ఓ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అంబర్​పేట డీడీ కాలనీలో కృష్ణతేజ రెసిడెన్సీ అపార్ట్​మెంట్స్​లో మంత్రి శ్యామ్(56) అనే వ్యాపారి నివాసముంటున్నాడు. మొదటి భార్య మాధవిలతతో గొడవలు ఉండడంతో ఫాతిమా అనే మహిలను రెండో పెండ్లి చేసుకున్నాడు. యూఎస్​ వెళ్లి వచ్చిన శ్యామ్ చిన్న చిన్న వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. 

ఇటీవల బంజారాహిల్స్ లో ల్యాండ్  అమ్మగా డబ్బులు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తాను ఉంటున్న రెసిడెన్సీకి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. శ్యామ్​ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండో భార్య ఫాతిమా అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదాలే కిడ్నాప్ కు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.