న్యూఢిల్లీ: భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తన బోర్డు సమావేశంలో వివిధ సంస్కరణలకు ఆమోదం తెలిపింది. కంపెనీలు ఐపీఓ వంటి ఇష్యూల ద్వారా నిధులు సమీకరించడానికి సమర్పించే ఆఫర్ డాక్యుమెంట్‌ను సులభతరం చేయడం ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటి. దీంతో ఇన్వెస్టర్లు మరింత స్పష్టమైన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది.
మ్యూచువల్ ఫండ్‌లలో టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (టీఈఆర్)ను ఇతర ఛార్జీల నుంచి విడదీసి చూపించడం ద్వారా పారదర్శకత పెంచాలని సెబీ నిర్ణయించింది. అదనంగా, డెట్ ఇష్యూలలో కొన్ని వర్గాల పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. ఎక్కువ అప్పులు ఉన్న కంపెనీలకు రూల్స్ భారాన్ని తగ్గించేందుకు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీస్ (హెచ్‌వీడీఎల్‌ఈఎస్) గుర్తింపు పరిమితిని రూ.1,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది.
సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే అధ్యక్షతన జరిగిన నాలుగో బోర్డు సమావేశం ఇది. ఎస్‌టీటీ, స్టాంప్ డ్యూటీ, జీఎస్‌టీ వంటి చార్జీలను టీఈఆర్ నుంచి వేరు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు ఖర్చులపై స్పష్టత ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
