నీటి యుద్ధాలు జరుగుతయ్..రాజకీయ కారణాలతోనే తెలంగాణ కొత్తగా నీటి కేటాయింపులు చేయాలంటున్నది

నీటి యుద్ధాలు జరుగుతయ్..రాజకీయ కారణాలతోనే తెలంగాణ కొత్తగా నీటి కేటాయింపులు చేయాలంటున్నది
  •     బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వితండవాదం
  •     ఏపీలోని ఔట్ సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌‌కు నీళ్లు ఇవ్వాలని సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ పోరాడుతుంటే.. ఆ పోరాటం ‘జల యుద్ధాలకు’దారి తీస్తుందంటూ ఏపీ అడ్డంగా వాదించింది. బుధవారం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2(బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు జరిగిన వాదనల్లో ఏపీ తన బుద్ధిని చాటింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పున:సమీక్షించాలని వాదిస్తున్నదని వితండ వాదం చేసింది. 

ఇలాగే జరిగితే నీటి యుద్ధాలు జరుగుతాయని వాదించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పున:సమీక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కొనసాగుతున్న నీటి పంపకాల ఆధారంగానే సమీక్ష ఉండాలని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. బచావత్ అవార్డుపై తెలంగాణకు పట్టింపు లేదని, కొత్త కేటాయింపులు చేయాలంటున్నదని వాదనకు దిగింది. కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేసినా.. ఏపీ విభజన చట్టం ప్రకారమే న్యాయబద్ధంగా చేయాలని డిమాండ్ చేసింది.

ఆర్డీఎస్, కేసీ కెనాల్ కేటాయింపుల విషయంలో మద్రాస్, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య 1944లో జరిగిన ఒప్పందానికి బచావత్ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ చట్టబద్ధత కల్పించలేదని పేర్కొంది. పూర్వ హైదరాబాద్ రాష్ట్రానికి ఎడమవైపున, మద్రాస్​రాష్ట్రానికి కుడివైపున సమాన హక్కులు కల్పించేలా నాడు ఒప్పందం చేసుకున్నారన్నారు. అంతేగానీ ఆర్డీఎస్ ఎడమవైపు, కేసీ కెనాల్ కుడివైపున సమాన హక్కులు కల్పించాలన్న తెలంగాణ వాదనల్లో నిజం లేదని ఏపీ వాదించింది. 

ఆ రెండింటికీ బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ వారీ కేటాయింపులను చేసిందని పేర్కొంది. ఏపీలోని ఔట్ సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌‌కు నీళ్లివ్వాలన్న ఉద్దేశంతోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టును నిర్మించేందుకు అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ వాదించింది. కుడి కాల్వ ద్వారా ఔట్ సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌‌కు నీళ్లిస్తారన్న విషయం నాటి హైదరాబాద్ ప్రభుత్వానికి తెలుసని పేర్కొంది. సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇరువైపులా 132 టీఎంసీలు తీసుకునేందుకు కేటాయింపులు ఇచ్చారని తెలిపింది. 

ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీని నిర్లక్ష్యం చేయలే..

ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ ప్రాజెక్టును ఏపీ నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ వాదించడంలో నిజం లేదని ఏపీ వాదించింది. ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీతో పాటు ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ నిర్మాణానికి బచావత్ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు ముందే ఏపీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఆ రెండు ప్రాజెక్టులకు ఆ తర్వాత బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయలేదని పేర్కొంది. ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ అనుమతుల కోసం ఉమ్మడి ఏపీలో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారని తెలిపింది. 1985లో సీడబ్ల్యూసీకి అప్రైజల్ కోరుతూ దరఖాస్తు చేసినా తిరస్కరించింది. దీంతో అప్పట్లో తాత్కాలికంగా ఏఎమ్మార్పీ లిఫ్ట్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారని తెలిపింది. 

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా.. అక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీని ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని తెలిపింది. ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ గ్రావిటీ కెనాల్ అని, 1995లో అందుబాటులో ఉన్న ప్రపంచ బ్యాంకు నిధులతో ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీతో పాటు తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పీ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపింది. తెలంగాణకూ న్యాయం చేయాలనే ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పీని కట్టారని తెలిపింది. కాగా, గురువారం కూడా ఏపీ వాదనలు కొనసాగనున్నాయి.