రామచంద్రభారతి రెండు పాస్​పోర్టులు కలిగి ఉన్నారు

రామచంద్రభారతి రెండు పాస్​పోర్టులు కలిగి ఉన్నారు

ఖైరతాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారా హిల్స్ పొలీసుల కథనం ప్రకారం.. ఎమ్మెల్యేల కోనుగోలుకు యత్నించారని  అక్టోబర్ 26న మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో రామచంద్ర భారతిపై కేసు నమోదు అయ్యింది. 27న  ప్రాథమిక విచారణలో  భాగంగా ఆయన నుంచి ఒక ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్, రెండు మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాటిని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరికి పంపించారు. ఆ ల్యాప్ టాప్ లో భరత్ కుమార్ శర్మ రెసిడెన్స్ ఆఫ్​ పుత్తూరు, కొడగు, కర్నాటక అడ్రస్ తో ఒక పాస్ పోర్ట్ దొరికింది.  మరో పాస్ పోర్ట్ హర్యానా అడ్రస్ తో ఉంది.  రెండు పాస్ పోర్టులు కలిగి ఉండడం నేరం కాబట్టి సిట్ ఆఫీసర్, ఏసీపీ బి.గంగాధర్  ఈ విషయంపై బంజారా హిల్స్ పొలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామచంద్ర భారతిపై  పాస్ పోర్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రామచంద్ర భారతికి మూడు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే ఆయనపై ఒక కేసు నమోదైంది.