హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. కన్వీనర్ కోటా ఫేజ్-1 కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేసేందుకు గడువును పొడిగిస్తూ రిజిస్ట్రార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత షెడ్యూల్ ప్రకారం ఈ గడువు గురువారంతో ముగుస్తుండగా... విద్యార్థుల సౌకర్యార్థం దానిని డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పెంచారు.
సీటు వచ్చిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, నిర్ణీత ఫీజులతో 21లోపు అలాట్ అయిన కాలేజీలో రిపోర్ట్ చేయాలని, లేకపోతే సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుందని వర్సిటీ స్పష్టం చేసింది. అలాగే జాయిన్ అయిన అభ్యర్థుల వివరాలను అదే రోజు సాయంత్రం 4.30 గంటల్లోపు పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని కాలేజీల ప్రిన్సిపాల్స్ ను ఆదేశించింది.
