
- నాగర్‌కర్నూల్ నడిబజార్లో దారుణం
- అమానుషంగా ప్రవర్తించిన కూతురు
- సోషల్ మీడియాలో పోస్ట్‌తో కేసు నమోదు
కందనూలు, వెలుగు : చిన్నప్పుడు తన బిడ్డ ఆకలేసి ఏడిస్తే పాలు పట్టి పడుకోబెట్టింది. తప్పటడుగులు వేస్తే చెయ్యి పట్టి నడిపించింది. కంటికి రెప్పలా కాపాడుకుని పెద్దదాన్ని చేసి పెండ్లి చేసింది. కానీ ఆ కూతురు మాత్రం ఆ విశ్వాసాన్ని మరిచి పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంతో నడి బజారులో గొడ్డును బాదినట్టు బాదింది. ఈ అమానుష ఘటన నాగర్‌కర్నూల్‌లో జరిగింది. దీన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరలైంది. నాగర్ కర్నూల్ 13 వార్డులోని బొడ్రాయి దగ్గర సంత బజారులో ఉండే భూషమ్మతో ఆమె తల్లి చంద్రమ్మ (70 ) ఉంటోంది. చంద్రమ్మకు వృద్ధాప్య పింఛన్ వస్తుండడంతో ఆ డబ్బులు తనకు ఇవ్వాలని భూషమ్మ పట్టుబడుతోంది.
భూషమ్మ తాగుడుకు బానిస కావడంతో డబ్బులు వృథా చేస్తుందని ఇవ్వడానికి తల్లి చంద్రమ్మ ఒప్పుకోలేదు. దీంతో బుధవారం ఉదయం తల్లిని ఇంటి ముందు బజారులోకి లాగి చితకబాదింది. డబ్బులు లాక్కోవడంతోపాటు చేతి కడియాలు గుంజుకొని రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. జుట్టు పట్టుకొని కొట్టింది. చుట్టుపక్కల వారు అడ్డొస్తే బూతులు తిట్టి దూరం పంపించింది. దీన్నంతా పక్కనే ఉన్న ఆమె భర్త చూస్తూనే ఉన్నాడు కానీ వారించే ప్రయత్నం చేయలేదు. ఓ యువకుడు ఈ ఘటనను అంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు భూషమ్మపై కేసు నమోదు చేశారు.