పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏవీ ఇన్ఫో ప్రైడ్ అపార్ట్మెంట్లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఒక రూమ్ లో డబ్బులు దాచి ఉంచారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

ఏవీ ఇన్ఫో ప్రైడ్ అపార్ట్మెంట్ వద్దకు కాంగ్రెస్ నాయకులు రావడంతో రెండు పార్టీల నాయకుల మధ్య గొడవ జరిగింది. పీర్జాదిగూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొట్టుకున్నారు. 

మేయర్ జక్క వెంకట్ రెడ్డి నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ లో భారీగా డబ్బుల సంచులు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే ఎం. సుధీర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. స్వల్ప లాఠీఛార్జీ చేశారు. మేయర్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు.