
షిమ్లా/రాంచీ/జైపూర్/కోల్ కతా: హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ పెను విధ్వంసాన్ని సృష్టించింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో ఊళ్లకు ఊళ్లే వరదలో మునిగిపోయాయి. కొన్ని ఊళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్లౌడ్ బరస్ట్ కారణంగా షిమ్లా, కులూ, మండీ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల ధాటికి షిమ్లా జిల్లాలోని సమేజ్ అనే గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది.
అక్కడ కేవలం ఒకే ఒక ఇల్లు మిగిలింది. దాదాపు 30 మంది గ్రామస్తులు గల్లంతయ్యారు. ‘‘బుధవారం అర్ధరాత్రి మా కుటుంబమంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. దీంతో మా ఇల్లంతా దద్దరిల్లింది. బయటకు వచ్చి చూడగా ఊరును వరద ముంచెత్తడం కనిపించింది. ఊళ్లోని కాళీమాత టెంపుల్ కు వెళ్లి మేం తలదాచుకున్నాం. తెల్లారి వచ్చి చూస్తే ఊరంతా నామరూపాల్లేకుండా పోయింది.
ఒక్క మా ఇల్లు మాత్రమే మిగిలింది” అని అనితా దేవి ఆవేదన వ్యక్తం చేసింది. కండ్ల ముందే ఊరంతా కొట్టుకుపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు తాను రాంపూర్ కు వెళ్లడంతో ప్రాణాలతో మిగిలానని బక్షి రామ్ అనే వ్యక్తి చెప్పారు. ‘‘నేను రాంపూర్ లో ఉండగా అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది. భారీ వరదలు వచ్చాయని చెప్పారు. నేను తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే సరికి ఊరంతా సర్వనాశనమైంది. మా కుటుంబంలోని 15 మంది గల్లంతయ్యారు” అని ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
వరదల కారణంగా చనిపోయినోళ్ల సంఖ్య 8కి చేరింది. శనివారం మరో మూడు మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా 45 మంది కోసం రెస్క్యూ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.