- ఇదే సీఎం రేవంత్, ప్రధాని మోదీ, కిషన్ రెడ్డి ప్లాన్: కేటీఆర్
- గణనీయంగా పడిపోయిన బొగ్గు ఉత్పత్తి
- సైట్ విజిట్ రూల్ పేరుతో రూ.10 వేల కోట్ల స్కామ్
- 49% వాటా ఉన్నా కేంద్రం మౌనం ఎందుకు?
- టెండర్లు రద్దు చేసి కుంభకోణాలు వారే బయటపెట్టుకుండ్రు
- గోదావరిఖని సింగరేణి కార్మిక గర్జనలో కేటీఆర్
కరీంనగర్ (గోదావరిఖని), వెలుగు: సింగరేణిని ప్రైవేటీకరించేందుకు రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి, మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సంస్థను ఉద్దేశపూర్వకంగా సంక్షోభంలోకి నెట్టి దివాళా తీయించేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బుధవారం టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సభలో కేటీఆర్ మాట్లాడారు. సింగరేణి గొంతు పిసికి చంపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డంపర్లకు టైర్లు, డోజర్లు, గ్రేడర్లు, షావెల్స్, స్పేర్ పార్ట్స్, లూబ్రికెంట్లు కొనడానికి కూడా సంస్థ వద్ద పైసల్లేని దుస్థితి నెలకొన్నదని అన్నారు.
మూసీ ప్రాజెక్టులో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణానికి నిధులుంటాయిగానీ సింగరేణి సంస్థ అభివృద్ధికి డబ్బులుండవా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గతంలో 91.8 శాతం మార్కులతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, కాంగ్రెస్ పాలనలో బొగ్గు కొరత వల్ల 65వ స్థానానికి దిగజారిందని మండిపడ్డారు. ఉన్న ప్లాంట్ను సక్రమంగా నడపడం చేతకాదని విమర్శించారు.
సింగరేణిలో అవినీతి రైజింగ్.. ఉత్పత్తి ఫాలింగ్
బీఆర్ఎస్ దిగిపోయే నాటికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు ఉంటే.. కాంగ్రెస్ హయాంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి 58 మిలియన్లకు పడిపోయిందని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడానికి కారణం కార్మికులు కాదని.. కాంగ్రెస్ నేత అవినీతి అని ఆరోపించారు. రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో అవినీతి రైజింగ్.. ఉత్పత్తి ఫాలింగ్ అన్నట్టు పరిస్థితి మారిందని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణిలో కుంభకోణాల కుంభమేళా నడుస్తోందని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో అన్నీ మైనస్ టెండర్లే ఉండేవని.. కాంగ్రెస్ హయాంలో ప్లస్ టెండర్లతో సింగరేణి కుదేలైందని తెలిపారు. సింగరేణిలో ఇప్పుడు అంతా సీఎం రేవంత్రెడ్డి బావమరిదిదే నడుస్తోందన్నారు. సభలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రులు జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ మధుసూదనచారి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కమీషన్ల కోసం కొత్త నాటకాలు..
కొత్త ఓబీ మైన్ల పేరుతో కేవలం కమీషన్ల కోసమే ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. మూడేండ్లుగా కమీషన్లు, పర్సంటేజీలు, దందాలు తప్పా సింగరేణిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం, మంత్రుల మధ్య వాటాలు కుదరకనే నైనీ టెండర్లను రద్దు చేశారని, కుంభకోణాలను కూడా వారే బయటపెట్టుకుంటున్నారని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ రూల్ పేరిట రూ.10 వేల కోట్ల స్కామ్ జరిగిందని, సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ కుంభకోణం వెనక రేవంత్రెడ్డి ఉన్నారన్నారు. ఇంకా సోలార్, జిలెటిన్ స్టిక్స్తోపాటు మరో నాలుగైదు కుంభకోణాలు జరిగాయని పేర్కొన్నారు.
ఇంత దోపిడీ జరుగుతున్నా సింగరేణి సంస్థలోని కేంద్ర డైరెక్టర్లు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా సింగరేణి కుంభకోణాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ‘‘రేవంత్ రెడ్డితో బీజేపీ లాలూచీ పడిందా? కమీషన్లు ముడుతున్నందుకే మౌనంగా ఉంటున్నారా?’’ అని ప్రశ్నించారు.
