- రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన కొత్త దంపతులు
సంగారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రేమ జంట ఒక్కటైంది. నామినేషన్ వేసిన తర్వాత రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ (బీసీ), శ్రీజ(ఎస్సీ) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేసేందుకు నిర్ణయించుకోగా.. సీటు ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది. దీంతో శనివారం అతను ప్రియురాలు శ్రీజతో నామినేషన్ వేయించాడు. అనంతరం ఇద్దరూ గుడికి వెళ్లి పెండ్లి చేసుకున్నారు.
ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం శ్రీజ,చంద్రశేఖర్ గౌడ్ దంపతులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తాము మేజర్లమని, ఇష్టపడే పెండ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. కాగా.. గ్రామానికి చెందిన కొందరు శ్రీజను నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.
ఇది తెలియడంతో నూతన దంపతులకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచి, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆశీర్వదించారు. తాళ్లపల్లి సర్పంచ్ గా శ్రీజను గెలిపిస్తే అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
