ఆస్తి కోసం మృతదేహం వేలిముద్రలు.. వీడియో వైరల్

ఆస్తి కోసం  మృతదేహం వేలిముద్రలు.. వీడియో వైరల్

ఆస్తికోసం చనిపోయిన మహిళ బొటనవేలిముద్రను ఆమె బంధువులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకుంది. కారులో వెనుక భాగంలో మహిళ మృతదేహం ఉండగా..ఆమె బంధువులు నకిలీ వీలునామాపై రెండు సార్లు బొటనవేలి ముద్రను  తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఏం జరిగిందంటే..

ఆగ్రాలోని సెవ్లా జాట్ ప్రాంతంలో నివాసముంటున్న కమలాదేవి అనే మహిళ 2021, మే8వ తేదీన చనిపోయింది. ఆమె భర్త అంతకు ముందే చనిపోయాడు.  ఆ దంపతులకు పిల్లలు లేరు. కమలాదేవి చనిపోయిన  తర్వాత.. ఆమె బావ కొడుకులు  మృతదేహాన్ని ఆగ్రా హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక  కారును ఆపి నకిలీ వీలునామాపై  కమలాదేవి బొటనవేలు ముద్ర వేయడానికి ఒక న్యాయవాదిని పిలిచారు. ఇందులో   ఇల్లు, దుకాణం సహా ఆస్తులను బావ కొడుకులకు కమలాదేవి రాసిఇస్తున్నట్లు తయారు చేశారు. అయితే  కమలా దేవి బొటన వేలి ముద్రను కాకుండా సంతకం చేస్తుంది. దీనిపై   కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో ఆమె మనవడు ( బిడ్డ కొడుకు) జితేంద్ర  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వీడియో బయటకు..

కమలాదేవి బొటన వేలిముద్రను ఆమె బావకొడుకులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన వీడియో  బయటకు వచ్చింది. ఈ వీడియోలో కారు వెనుకసీట్లో ఉన్న కమలాదేవి మృతదేహం పడింది. ఈ సమయంలో  ఓ  న్యాయవాది స్టాంప్ ప్యాడ్ పై  కమలాదేవి బొటన వేలి ముద్రను వేస్తున్నాడు. 45 సెకన్ల వీడియోలో కనిపించింది. దీంతో జితేంద్ర కుటుంబం అనుమానమే నిజమైంది. దీనిపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

దిగ్భ్రాంతి ..

ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారడంపై ఆగ్రాలోని స్థానికులు మండిపడుతున్నారు. అమానవీయ ప్రవర్తన అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని సామాజిక బహిష్కరణకు గురి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ఫోర్జరీకి సహకరించిన లాయర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  మరికొందరు ఆయన లైసెన్స్‌ను రద్దు చేయాలంటున్నారు.