బాలానగర్​లో 16 మందిపై కుక్క దాడి

బాలానగర్​లో 16 మందిపై కుక్క దాడి

కూకట్​పల్లి, వెలుగు : బాలానగర్​లో ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. 16 మందిపై విచ్చలవిడిగా దాడికి పాల్పడి గాయపర్చింది. శనివారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు దాదాపు మూడు గంటల పాటు ఓ కుక్క చేసిన హంగామాకి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాలానగర్​నుంచి వినాయకనగర్, నవజీవన్​నగర్​కు వెళ్లే దారిలో వచ్చిపోయే వారిపై విరుచుకుపడింది. 8 మంది చిన్నారులతోపాటు మరో 8 మంది పెద్దలపై దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులు నిఖిల్, అనూషలు తీవ్రంగా గాయపడ్డారు. నిఖిల్​ను తల వెనుక భాగంలో కరవగా, అనూషకు పొట్ట భాగంలో గాయపర్చింది. స్థానికులు కూకట్​పల్లి డాగ్​స్క్వాడ్​కి సమాచారం అందించగా.. సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఆ కుక్కని పట్టుకున్నారు. గాయపడిన బాధితులంతా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

కుక్కల దాడిలో 4 లేగ దూడలు మృతి

శంషాబాద్ : ఓ నిరుపేద రైతుకు చెందిన నాలుగు లేగ దూడలపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చాయి. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలో జరిగింది. శంషాబాద్ మండలం నర్కుడ గ్రామానికి చెందిన రైతు నిమ్మల శేఖర్ కొన్ని రోజుల క్రితం రూ.2 లక్షల 50వేలతో బర్రెలు కొనుగోలు చేసి, వాటి పాలు పిండుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే ఈ బర్రెలకు 4 లేగ దూడలు జన్మించాయి. ఆదివారం ఉదయం వీధి కుక్కలు ఆ దూడలపై దాడి చేసి చంపాయి. పొలానికి వచ్చిన శేఖర్ చనిపోయిన లేగ దూడలను చూసి కన్నీరు మున్నీరయ్యాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, గ్రామస్తులను వేడుకున్నాడు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నుంచి గ్రామాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేశారు.