కేటీఆర్ ఆదేశాలతో బాధితుడికి డబుల్ బెడ్ రూం ఇల్లు అందజేత

కేటీఆర్ ఆదేశాలతో బాధితుడికి డబుల్ బెడ్ రూం ఇల్లు అందజేత

కరెంట్ షాక్‭కు గురై రెండు చేతులు కోల్పోయిన సత్యనారాయణ కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. కూకట్ పల్లి బాలానగర్ డివిజన్ లోని చిత్తారమ్మ బస్తీలో వారికి డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాధితుడి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించారు. ఎమ్మెల్యే కృష్ణారావు స్వయంగా వెళ్లి.. బాధితుడి కుటుంబసభ్యులతో గృహ ప్రవేశం చేయించారు. 

సత్యనారాయణ గత కొంత కాలంగా కూకట్ పల్లిలో నివాసం ఉంటూ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తన రెండు చేతులు కోల్పోయాడు. తన కుటుంబానికి తానే జీవనాధారం అని తమను ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‭కు ట్వీట్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఆపదలో తమకు సహకరించడం పట్ల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కృష్ణారావుకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని వారు వెల్లడించారు.