అభిషేక్, బుమ్రా కాదు.. టీ20 వరల్డ్ కప్‎లో ఇండియాకు అతడే కీ ప్లేయర్: డివిలియర్స్

అభిషేక్, బుమ్రా కాదు.. టీ20 వరల్డ్ కప్‎లో ఇండియాకు అతడే కీ ప్లేయర్: డివిలియర్స్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో పాండ్యా భారత్‌కు కీలకం కానున్నాడని.. మ్యాచ్‌లను గెలిపించడంలో అతడు కీ రోల్ ప్లే చేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆదివారం (జనవరి 4) తన యూట్యూబ్ ఛానెల్‌లో ఏబీడీ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్‎కు భారత జట్టు కూర్పును విశ్లేషించాడు. 

‘‘బ్యాట్, బాల్ రెండింటిలోనూ రాణించే ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంతో జట్టు సమతుల్యంగా ఉంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‎లో టీమిండియాకు హార్దిక్ చాలా కీలకమైన ఆటగాడు అవుతాడు. బ్యాట్, బాల్‎తో అతడు మ్యాచ్‎లు గెలిపించగలడు. అతను ఏ పరిస్థితిలోనైనా బౌలింగ్ చేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా అతడి సొంతం‘‘ అని పేర్కొన్నాడు.

అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి జట్లు త్వరగా ఔట్ చేయాలని భావిస్తాయని.. ఎందుకంటే హార్ధిక్ నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు. బ్యాట్‎తోనే కాకుండా బంతితోనూ హార్ధిక్ ప్రత్యర్థులను వణికించగలడని ప్రశంసించాడు. పాండ్యా జట్టులో ఉండటం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‎కు గొప్ప ఆస్థి అని అన్నాడు. 

►ALSO READ | ఇండియన్ ప్లేయర్‎కు నో ఛాన్స్: UPవారియర్జ్ కెప్టెన్‌గా మెగ్ లానింగ్

కాగా, 2026 టీ20 వరల్డ్ కప్‎కు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా అతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఫిబ్రవరి 7న పాకిస్తాన్–నెదర్లాండ్ మ్యాచ్‎తో తెరలేవనుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్‎గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి.

ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్‎లో  భాగం కానున్నాయి.

వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్:  

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా