- యూత్ సడెన్ డెత్స్ పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు
- మృతుల్లో 57 శాతం మంది 18–45 ఏండ్లవారే
- పోస్టుమార్టంలో 70% బ్లాకేజీలు గుర్తింపు
- కరోనా వ్యాక్సిన్ కు.. ఈ చావులకు లింక్ లేదని క్లారిటీ
- చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలియడం లేదని గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: దేశంలో యువత సడెన్‌గా కుప్పకూలిపోతూ.. గుండెపోటుతో చనిపోతున్న ఘటనల వెనక కారణాలపై ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. యువతలో చాలా మంది పైకి హెల్దీగానే కనిపిస్తున్నా.. లోలోపల వారి గుండెల్లో బ్లాకేజీలు పెరుగుతున్నాయని వెల్లడైంది. చాలా మందికి అసలు సమస్య ఉన్నట్టు కూడా చనిపోయేదాకా తెలియడం లేదని తేలింది. ఈ స్టడీలో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో మే 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఏడాది కాలంలో వచ్చిన మొత్తం 2,214 పోస్టుమార్టం కేసులను పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్లు పరిశీలించారు. మరణం సంభవించిన 48 గంటలలోపే కుటుంబ సభ్యుల అనుమతితో పరీక్షలు నిర్వహించారు. అందులో180 కేసులు సడెన్ డెత్ గా తేలాయి. ఈ ఆకస్మిక మరణాల్లో పెద్ద వయసు వారి కంటే యువకులే ఎక్కువగా ఉన్నారని వెల్లడైంది. 46 నుంచి 65 ఏండ్ల వయసు వారిలో ఇలాంటి మరణాలు 42.8 శాతంగా ఉంటే.. 18 నుంచి 45 ఏండ్ల నడివయసు వారిలో ఏకంగా 57.2 శాతం నమోదయ్యాయి. అంటే వృద్ధుల కంటే యువతే ఎక్కువగా గుండె ఆగి చనిపోతున్నారు. చనిపోయిన యువకుల్లో సగటు వయసు కేవలం 33.6 ఏళ్లు మాత్రమే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక మొత్తం యువత మరణాల్లో 42.6 శాతం మంది గుండె సంబంధిత సమస్యల వల్లే చనిపోయారని స్టడీలో తేలింది.
లైఫ్ స్టైలే ప్రధాన కారణం
చిన్న వయసులోనే గుండె ఆగిపోవడానికి లైఫ్ స్టైల్ కూడా ప్రధాన కారణమని ఎయిమ్స్ స్టడీ తేల్చింది. మందు, స్మోకింగ్ లాంటి అలవాట్లు కూడా గుండె సమస్యకు కారణంగా మారుతున్నట్లు వెల్లడించింది. చనిపోయిన యూత్ లో 57.4 శాతం మందికి స్మోకింగ్, 52.1 శాతం మందికి ఆల్కహాల్ అలవాటు ఉందని డాక్టర్లు గుర్తించారు. ఈ అలవాట్లే రక్తనాళాల్లో బ్లాకులకు కారణమై, చివరికి సడెన్ డెత్ కు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చనిపోయిన వారిలో 80 శాతం మంది దిగువ, మధ్యతరగతికి చెందినవారే ఉన్నారు. అలాగే 40 శాతం డెత్స్ రాత్రి పూట, తెల్లవారుజామున నిద్రలోనే సంభవించాయి. డెత్స్ కు ముందు చాలా మందిలో ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపించాయని స్టడీలో గుర్తించారు.
సమస్య ఉన్నట్లు వాళ్లకే తెలియదు
చనిపోయిన యువకుల్లో చాలా మందికి తమకు గుండె జబ్బు ఉన్న సంగతే తెలియదు. వారు బతికున్నంత కాలం ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. కానీ చనిపోయాక పోస్టుమార్టం చేస్తే.. వారి గుండె రక్తనాళాల్లో ఏకంగా 70 శాతానికి పైగా బ్లాకేజీలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ(ఎల్ఏడీ)లోనే ఎక్కువగా బ్లాకులు ఏర్పడ్డాయని స్టడీలో తేలింది. చాలా మందిలో 70 శాతం బ్లాకేజీలున్నా ఒక్కోసారి సింప్టమ్స్ కూడా తెలియవని డాక్టర్లు చెప్తున్నారు. 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా గుండె పరీక్షలు చేయించుకోవాలని, కుటుంబంలో ఎవరైనా చిన్న వయసులో చనిపోయి ఉంటే జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు.
21శాతం మరణాలకు కారణమే తెలియదు
గుండె జబ్బులే కాకుండా.. అసలు ఏ కారణం చేత చనిపోయారో కూడా తెలియని కేసులను సైతం డాక్టర్లు గుర్తించారు. దీనినే మెడికల్ పరిభాషలో నెగెటివ్ అటాప్సీ అంటారు. అంటే మనిషి చనిపోయాక పోస్టుమార్టం చేసినా.. శరీరంలోని ప్రతి అవయవాన్ని మైక్రోస్కోప్ లో పరీక్షించినా మరణానికి కారణం దొరకకపోవడం. యువత ఆకస్మిక మరణాల్లో సుమారు 21.3 శాతం కేసులు ఇలాంటివే ఉండటం గమనార్హం. ఇలాంటి వాటికి జన్యుపరమైన గుండె సమస్యలు కారణం కావొచ్చని, వీటిని మాలిక్యులర్ అటాప్సీతో కనిపెట్టవచ్చని డాక్టర్లు వెల్లడించారు. అలాగే గుండె తర్వాత అత్యధికంగా 21.3 శాతం మంది న్యుమోనియా, టీబీ వంటి ఊపిరితిత్తుల సమస్యలతో చనిపోయారని పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ కారణం కాదు
కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ఏ సడెన్ డెత్ జరినా.. దానికి కారణం కొవిడ్ వ్యాక్సిన్ కారణమనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ స్టడీలో ఆ అనుమానాలకు డాక్టర్లు చెక్ పెట్టారు. సడెన్ డెత్స్ కు, కొవిడ్ వ్యాక్సిన్ కు ఎలాంటి లింక్ లేదని స్పష్టం చేశారు. చనిపోయిన వారిలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, తీసుకోని వారు ఇద్దరూ ఉన్నారని తేల్చారు. అలాగే గతంలో కొవిడ్ సోకడం.. సోకకపోవడమనే అంశానికి కూడా ఈ మరణాలతో సంబంధం లేదని తేల్చిచెప్పారు.
రక్తనాళాల పరీక్షలను తప్పనిసరి చేయాలి
గుండె సమస్యలు ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఛాతీ మధ్యలో బరువుగా ఉండి.. కేవలం 2–3 నిమిషాలు ఎక్కువ నొప్పి ఉంటుంది. ఈ పెయిన్ అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. అలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ను కలవాలి. మన దగ్గర స్మోకింగ్, ఆల్కహాల్ తో పాటు ఎనర్జీ డ్రింక్స్, నిద్రలేమి, ఒత్తిడి యువత గుండెను దెబ్బతీస్తున్నాయి. చిన్న వయసు నుంచే బేసిక్ కార్డియాక్ స్క్రీనింగ్స్ చేయించుకుంటూ, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అలాగే స్కూల్స్, కాలేజీల అడ్మిషన్లు, ఉద్యోగాల్లో చేరేటప్పుడే గుండె, రక్తనాళాల పరీక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేస్తే బాగుంటుంది.
- డాక్టర్ అమరేశ్ రావు, హెచ్ఓడీ, కార్డియో థోరాసిక్ డిపార్ట్మెంట్, నిమ్స్, హైదరాబాద్
కీ పాయింట్స్..
ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాలివే..
- గుండె సమస్యలు: యువతలో 42.6% మరణాలకు ఇవే కారణం.
- ఇందులో 85% మందికి కరోనరీ ఆర్టరీ డిసీజ్(సీఏడీ) ఉంది.
- చాలా మందిలో రక్తనాళాల్లో 70% కంటే ఎక్కువ బ్లాకేజీలు ఉన్నట్లు తేలింది.
- ముఖ్యంగా లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ రక్తనాళంలో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి.
- శ్వాసకోశ సమస్యలు: 21.3% మరణాలు న్యుమోనియా, టీబీ వంటి ఊపిరితిత్తుల సమస్యల వల్ల సంభవించాయి.
కారణం తెలియని మరణాలు
- (నెగెటివ్ అటాప్సీ): 21.3% కేసుల్లో పోస్టుమార్టం, హిస్టోప్యాథాలజీ చేసినా మరణానికి కారణం తెలియలేదు. వీటి వెనుక జన్యుపరమైన గుండె సమస్యలు ఉండొచ్చని అంచనా.
- ఇతర కారణాలు: జీర్ణకోశ సమస్యలు (6.4%), మెదడు సంబంధిత సమస్యలు (సీఎన్ఎస్ 3.2%).
- అలవాట్లు, జీవనశైలి: చనిపోయిన యువతలో 57.4% మంది స్మోకర్లు. అలాగే 52.1% మందికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది.
- కొవిడ్ ప్రభావం లేదు: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి, తీసుకోని వారికి ఆకస్మిక మరణాల రేటులో సంబంధం లేదు. గతంలో కరోనా సోకడం వల్ల ఈ మరణాలు సంభవించాయని చెప్పడానికి కూడా ఆధారాలు దొరకలేదు.
ఇతర అంశాలు..
- సడెన్ డెత్స్ ఎక్కువగా జరిగిన టైం: 40.1% మరణాలు రాత్రి పూట, తెల్లవారుజామున సంభవించాయి.
- లక్షణాలు: స్పృహ కోల్పోవడం (35.8%), ఛాతీ నొప్పి (20.4%), శ్వాస ఆడకపోవడం(10.5%).
- ఆర్థిక స్థితి: చనిపోయిన వారిలో 80.2% మంది దిగువ, మధ్యతరగతి వర్గాలకు చెందినవారే ఉన్నారు
- షుగర్, బీపీ వంటి సమస్యలు యువత కంటే వృద్ధుల్లో (46-–65 ఏండ్లు) ఎక్కువగా ఉన్నాయి.
- యువతలో (18–-45 ఏండ్లు) గుండెపోటు మరణాలు ఆందోళనకరంగా పెరిగాయని, చాలా సందర్భాల్లో లక్షణాలు బయటపడకుండానే తీవ్రమైన గుండె జబ్బులు ఉంటున్నాయని ఈ స్టడీ తేల్చి చెప్పింది.
స్టడీ పీరియడ్:
- మే 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు (ఏడాది పాటు)
- ఎక్కువ మరణాలు:
- రాత్రి పూట,తెల్లవారు జామున 40.1%
యువతవే ఎక్కువ
- 18-45 ఏళ్ల వారు103 మంది 57.2%
- 46-65 ఏళ్ల వారు77 మంది 42.8%
- యావరేజ్ ఏజ్:33.6 సంవత్సరాలు
పురుషుల్లోనే ఎక్కువ..
సడెన్ డెత్స్‌లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ నిష్పత్తి 1:4.5
