మాసాయిపేటలో నకిలీ విత్తన కంపెనీ

మాసాయిపేటలో నకిలీ విత్తన కంపెనీ
  •  ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సీజ్‌‌‌‌ చేసిన ఆఫీసర్లు

వెల్దుర్తి,  వెలుగు : మెదక్‌‌‌‌ జిల్లా మాసాయిపేటలో అనధికారికంగా ఏర్పాటు చేసిన నకిలీ విత్తన పరిశ్రమను మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ గురువారం సీజ్‌‌‌‌ చేశారు. మాసాయిపేట సమీపంలోని పోతన్‌‌‌‌శెట్టిపల్లి  మెదక్‌‌‌‌రహదారి పక్కన గల ఓ వెంచర్‌‌‌‌లో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు, లైసెన్స్‌‌‌‌ లేకుండా విత్తన శుద్ధి కేంద్రాన్ని, గోడౌన్‌‌‌‌ను ఏర్పాటు చేసి విత్తనాలను అమ్ముతున్నారు.

ఈ విషయంపై స్థానికులు అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో మండల వ్యవసాయాధికారి ఝాన్సీ గురువారం కంపెనీ వద్దకు చేరుకొని తనిఖీలు చేశారు. సుమారు 279 క్వింటాళ్ల విత్తనాలను నిల్వ చేసినట్లు గుర్తించారు. విత్తనాల బస్తాలపై పేరు లేకపోవడం, కంపెనీకి అనుమతులు లేకపోవడంతో పరిశ్రమని సీజ్‌‌‌‌ చేసి, కేసు నమోదు చేసినట్లు అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ చెప్పారు.

ఐదు క్వింటాళ్ల నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత

ఆసిఫాబాద్, వెలుగు : అక్రమంగా అమ్ముతున్న నిషేధిత పత్తి విత్తనాలను గురువారం ఆసిఫాబాద్‌‌‌‌ పోలీసులు, అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఆసిఫాబాద్‌‌‌‌ సీఐ సతీశ్, ఎస్సై ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ కలిసి గురువారం బూరుగుడా స్టేజ్‌‌‌‌ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన పర్వతాల ప్రశాంత్‌‌‌‌ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని తనిఖీ చేయగా 50 కిలోల నిషేధిత బీటీ 3 విత్తనాలు దొరికాయి.

ప్రశాంత్ సొంతూరు చింతలమానేపల్లి మండలం గూడెంలో తనిఖీ చేయగా మరో నాలుగున్నర క్వింటాళ్ల విత్తనాలు దొరికాయి. ప్రశాంత్‌‌‌‌ను పూర్తి స్థాయిలో ప్రశ్నించగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని కొత్తూరుకు చెందిన సొల్లు పెద్దయ్య అలియాస్‌‌‌‌ సురేశ్‌‌‌‌ వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ప్రశాంత్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.