రాళ్ల వర్షంతో పంట పాడైందని పురుగులమందు తాగబోయిండు

రాళ్ల వర్షంతో పంట పాడైందని పురుగులమందు తాగబోయిండు

చిట్యాల, వెలుగు: అకాల వర్షంతో పంట దెబ్బతినడంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పక్కనే ఉన్న రైతులు అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన దేశబోయిన భిక్షమయ్య తనకున్న మూడెకరాలతోపాటు పక్కన 5 ఎకరాలను కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. పంట కోతకు వచ్చింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విపరీతమైన గాలికి తోడు రాళ్లతో కూడిన భారీ వర్షం దాదాపు గంటసేపు పడింది. వడ్లు మొత్తం చేనులో రాలిపోయాయి. పంటను చూసి మనస్తాపానికి గురైన భిక్షమయ్య అక్కడే ఉన్న పురుగుల మందు తాగబోయాడు. అక్కడే ఉన్న రైతులు గోలి శంకరయ్య, ఉప్పల యాదయ్య, నర్సింహ గమనించి అతడిని అడ్డుకున్నారు. పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. వర్షం వల్ల జరిగిన పంట నష్టాన్ని అధికారులు గుర్తించి ఆదుకోవాలని రైతులు కోరారు.

పలు జిల్లాల్లో వర్షం

ఉమ్మడి నల్గొండ, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం, ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం వడగండ్ల వాన పడింది. వరి చేన్లు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్ధన్నపేట, ఐనవోలు, నెక్కొండ తదితర మండలాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపడ్డాయి.

See Also: నిర్భయ దోషులకు ఉరి అమలు