పాస్​బుక్​ రాక  భూమి దక్కదని రైతు ఆత్మహత్య

పాస్​బుక్​ రాక  భూమి దక్కదని రైతు ఆత్మహత్య

నారాయణపేట, వెలుగు: వారసత్వంగా వచ్చిన భూమికి పాస్​బుక్​ రాలేదని.. తన భూమి తనకు దక్కుతుందో లేదోననే ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన సిద్ధప్ప(40)కు ఏడెకరాల భూమి వారసత్వంగా వచ్చింది. 4 సంవత్సరాల క్రితం భూ ప్రక్షాళనలో భాగంగా ఆ భూమిని అధికారులు ఇతరులపై పట్టా చేశారు. ఇతరుల సర్వే నంబర్ ఉన్న ఎకరా భూమి ఇతని పేరిట చేశారు. అప్పటి నుంచి రైతు తన పాత బుక్​లతో అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. జులై 7న జిల్లా కలెక్టర్​కు సైతం దరఖాస్తు చేసుకున్నాడు. స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేటికీ సమస్యను పరిష్కరించకపోవడంతో సిద్ధప్ప బుధవారం రాత్రి తన పొలంలో  చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గురువారం జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సిద్ధప్ప కుటుంబసభ్యులు, వ్యవసాయ సంఘం నాయకులు పాత బస్టాండ్ దగ్గర రాస్తారోకో చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కారణమైన వారిని సస్పెండ్ చేయాలని, రైతు కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.