
తంగళ్లపల్లి, వెలుగు: తహసీల్దార్ కార్యాలయానికి ఓ రైతు పెట్రోల్డబ్బాతో రావడం తంగళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపల్లె గ్రామానికి చెందిన పన్యాల చంద్రయ్య, బద్దనపెల్లి గ్రామానికి చెందిన పన్యాల నర్సింహారెడ్డి వద్ద 0.29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. తన భార్య పన్యాల లింగవ్వ పేరు మీద పట్టా మార్పిడి చేయడానికి కొన్ని నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకోవడానికి బుధవారం తహసీల్దార్ఆఫీస్కు వచ్చాడు. చంద్రయ్య చేతిలో పెట్రోల్డబ్బా ఉండటంతో గమనించిన ఆర్ఐ సంతోష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆరా తీశారు. తన పట్టా మార్పిడి పని విషయమై వచ్చానని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై చంద్రయ్య మాట్లాడుతూ తన భూమికి సంబంధించి ప్రోసీడింగ్పూర్తయిందని, వేలిముద్ర వేయడానికి ఎప్పుడు రమ్మంటారో తెలుసుకుందామని వచ్చానని అన్నారు. తాను ఎప్పుడూ పెట్రోల్ సిరిసిల్ల నుంచి తీసుకెళతానని, ఎప్పటిలాగే తీసుకెళ్తూ పని విషయమై ఎమ్మార్వో ఆఫీస్కు వెళ్లానని తెలిపారు.