తిరుమల నడక మార్గంలో ఐదేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి

తిరుమల నడక మార్గంలో ఐదేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్డులో ఐదేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి చేసింది. గురువారం (జూన్ 22న) తిరుమల నడక మార్గంలోని ఏడవ మైలురాయి వద్దకు వచ్చిన చిరుత.. ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి, ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ ఘటనను చూసిన పోలీసులు, భక్తులు గట్టిగా కేకలు వేయడంతో భయపడి బాలుడిని వదిలేసి అడవిలోకి పారిపోయింది. 

తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం108లో శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని చెబుతున్నారు. చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడిపై చిరుత దాడి బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. పులిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 

ఈ సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళుతున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అక్కడ బందోబస్తు పెంచారు.