చెప్పులు మోయడానికి... తీసివ్వడానికి తేడా తెలియని మూర్ఖుడు

చెప్పులు మోయడానికి... తీసివ్వడానికి తేడా తెలియని మూర్ఖుడు
  • బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్​ ఫైర్​
  • రాష్ట్రాన్ని సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణాలో నంబర్​ వన్​ చేసిండు
  • దేశంలో ఏ స్కాం బయటపడ్డా కేసీఆర్​ ఫ్యామిలీ పేరే వినిపిస్తున్నది
  • సింగరేణిని దివాలా తీయించిండు 26 రాష్ట్రాల రైతు నేతలతో భేటీకి  రాష్ట్ర రైతులను ఎందుకు పిల్వలే?
  • కేసీఆర్​కే రాష్ట్ర ప్రజలు మీటర్​ పెట్టడం ఖాయం
  • లిక్కర్​ స్కామ్​పై ట్విట్టర్​ టిల్లు ఎందుకు మాట్లాడ్తలే
  • ఏ తప్పు చేయకపోతే కాళేశ్వరం సందర్శనకు పర్మిషన్​ ఇయ్యాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు:  కేసీఆరే పెద్ద గజదొంగ అని, సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణాలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా మార్చారని బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో తన రాజకీయ గురువైన ప్రొఫెసర్ జయశంకర్ ను కాలితో తన్ని అవమానించిన కేసీఆర్.. చెప్పులు మోయడానికి, చెప్పులు తీసివ్వడానికి మధ్య తేడా తెలియని మూర్ఖుడు. వావివరసలు తెలియని మూర్ఖత్వపు కుటుంబం కేసీఆర్​ది” అని దుయ్యబట్టారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి సభలో మోడీపై, బీజేపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి సభకు జనాన్ని తరలించేందుకు ప్రైవేటు స్కూళ్లను బెదిరించి బస్సులన్నీ తీసుకెళ్లారని, అక్కడ స్కూళ్లను బంద్ పెట్టించారని మండిపడ్డారు. ‘‘మాకు అమిత్ షా రాజకీయ గురువు. పెద్దలను గౌరవించడం మా సంస్కృతి. పాదయాత్రలో ఎంతోమంది చెప్పులు రోడ్డుపై పడితే తీసిచ్చిన. అంతమాత్రాన వాళ్ల చెప్పులు మోసినట్లా..? అయినా కేసీఆర్​ లెక్క అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం మేము కాదు” అని అన్నారు. దేశంలో ఎక్కడ ఏ స్కాం బయటపడినా కేసీఆర్​ కుటుంబం పేరే వినిపిస్తున్నదని, దీన్ని చూసి ప్రజలంతా ఛీ కొడుతున్నారని అన్నారు. ‘‘ఆర్థిక నేరాల్లో నంబర్​ 2 గా, వృద్ధులపై దాడుల్లో నంబర్ 3 గా, రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 4 గా తెలంగాణను మార్చింది నీవు కాదా? నీ పిచ్చి పీక్​ స్టేజ్​కు చేరింది” అని కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ తర్వాత చివరకు టీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్​ కుటుంబ అవినీతి గురించి చర్చించుకుంటున్నారని బండి సంజయ్​ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తాము అనుమతి అడిగామని, కేసీఆర్ సర్కార్ ఏ తప్పూ చేయకపోతే, శుద్ధ పూసలైతే అనుమతి ఇవ్వాలని, తాము  ఆ ప్రాజెక్టును సందర్శించి వస్తామని సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 

రైతు సంఘాల సమావేశానికి రాష్ట్ర రైతులను ఎందుకు పిల్వలే?

‘‘సీఎం కేసీఆర్​ ఇతర రాష్ట్రాల రైతు నేతలతో సమావేశం పెట్టుకొని.. రాష్ట్రంలోని రైతు సంఘాల నేతలను ఎందుకు పిలవలేదు? కాంగ్రెస్ తోపాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన రైతు సంఘాలు కూడా ఉన్నాయి కదా.. మరి వాళ్లనెందుకు పిలువలేదు” అని బండి సంజయ్​ నిలదీశారు. ‘‘26 రాష్ట్రాల రైతు నేతలతో జరిపిన సమావేశంలో రుణ మాఫీ ఎందుకు అమలు చేయలేదో చెప్పినవా..? వరి వేస్తే ఉరే అని మొరిగినట్లు, ఫాంహౌస్​లో మాత్రం వరి వేసి లాభపడ్డట్లు చెప్పలేదా?” అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా కేసీఆర్​ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పైసా ఇవ్వలేదని, అలాంటిది పంజాబ్ వెళ్లి అక్కడి  రైతులకు రూ. 3 లక్షలు ఇచ్చారని అన్నారు. ‘‘తెలంగాణ ప్రజలకు చెల్లని రూపాయిగా మారిన నీ సంగతి ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతల సమావేశంలో  చెప్పేది ఉండె” అని విమర్శించారు. ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఇచ్చిన హామీలన్నీ ఎటుపోయాయని ఆయన ప్రశ్నించారు. ‘‘రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం వంటి హామీలన్నీ ఏమైనయ్. ​రాష్ట్ర ప్రజలు ఎందుకు దుర్భర జీవితాలు గడుపుతున్నరు? కేసీఆర్.. నీకు దమ్ముంటే పోలీస్ బందోబస్తు లేకుండా పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకో.  నేను నాలుగవ ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12 న స్టార్ట్ చేస్తున్నా.. నువ్వు ఆరోజు పాదయాత్ర స్టార్ట్ చెయ్.. నేను బంద్ చేస్తా.. నువ్వు తిరగవు. మేం తిరిగితే తట్టుకోలేకపోతున్నవ్​” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారిక కార్యక్రమాల్లో ప్రధానిని తిడుతవా?

‘‘ఒక సీఎంగా ఉంటూ ప్రజల కోసం ఏం చేశావో చెప్పకుండా.. అధికారిక కార్యక్రమాలకు వెళ్లి ప్రధానిని తిడుతవా?’’ అని కేసీఆర్​పై సంజయ్​ మండిపడ్డారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడితే.. కేసీఆర్​ మాత్రం మతం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘మోడీకి మీటర్ పెట్టాలంటవా? తెలంగాణ ప్రజలు నీకే  మీటర్ పెట్టబోతున్నరు బిడ్డా..! నువ్వే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నవ్​. ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టాలనుకుంటున్నవ్​. మోటార్లకు మీటర్లు పెడితే నిన్ను గ్రామాల్లో తిరగనీయం” అని కేసీఆర్​ను హెచ్చరించారు.  ‘‘లిక్కర్ స్కాం గురించి ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడ్తలే? తమ పాత్ర ఏమీ లేదని నీ కుటుంబం ఎందుకు చెప్తలే? ” అని కేసీఆర్​ను సంజయ్ ప్రశ్నించారు.

సింగరేణిని నాశనం చేసిందెవరు? 

సింగరేణిని నాశనం చేసిందే కేసీఆర్​ అని సంజయ్​ దుయ్యబట్టారు. ‘‘సింగరేణిని నాశనం చేసింది నువ్వు కాదా?  2‌‌‌‌0 వేల ఉద్యోగాల కోత పెట్టింది ఎవరు? కార్మికుల పొట్ట కొట్టింది టీఆర్ఎస్ సర్కార్ కాదా? సంస్థను బొందల గడ్డగా మార్చింది నీ పాలనలోనే కదా? సింగరేణి నుంచి 20 వేల కోట్ల రూపాయలు తీసుకుని సంస్థను దివాలా తీయించింది నువ్వుగాక ఇంకెవరు..? సింగరేణి ఉద్యోగులకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి జీతాలిచ్చే దుస్థితికి సంస్థను ఆర్థికంగా దివాలా తీయించింది నువ్వు కాదా?” అని కేసీఆర్​పై ఫైర్​ అయ్యారు. ‘‘కేసీఆర్..! నీకు చేతనైతే తెలంగాణకు నువ్వు  చేసిన అభివృద్ధి ఏమిటో  చెప్పు.. నువ్వు చేసిన అప్పులెన్ని... కేంద్రం ఇచ్చిన నిధులెన్ని....ముందు ఆ లెక్కలు చెప్పు.. ఆ తర్వాతే రాజకీయాలు మాట్లాడు... నువ్వు మోడీని తిట్టేంత గొప్పోడివా?” అని విరుచుకుపడ్డారు.