పోలీసుల ముసుగులో .. గంజాయి స్మగ్లింగ్‌‌

పోలీసుల ముసుగులో .. గంజాయి స్మగ్లింగ్‌‌
  • ఏడుగురు అరెస్ట్.. 44 కిలోల గంజాయి, 4 కార్లు, 8 సెల్‌‌ఫోన్స్ స్వాధీనం 
  • స్మగ్లింగ్‌‌ ముఠాలో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ 
  • కార్లకు పోలీస్ సైరన్‌‌, స్టిక్కర్లు అతికించి గంజాయి సరఫరా 

హైదరాబాద్, వెలుగు: గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్‌‌ సహకారంతో గంజాయి స్మగ్లింగ్‌‌ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురిని టీఎస్‌‌ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీన్యాబ్‌‌) బుధవారం అరెస్ట్ చేసింది. మరొక నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. వీరి నుంచి రూ.12 లక్షల విలువ చేసే 44 కిలోల గంజాయి, 4 కార్లు, 8 సెల్‌‌ ఫోన్స్ స్వాధీనం చేసుకుంది. వీటి మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా. టీన్యాబ్‌‌ డైరెక్టర్‌‌‌‌, సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌ గురువారం కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌‌ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన వంకుడోతు వీరన్న(33) 2013లో ఈఈఈలో డిప్లొమా పూర్తి చేశాడు. అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రెండు చోరీలు చేసి అరెస్టయ్యాడు. సూర్యాపేట జిల్లా తనమచెర్ల తండాకు చెందిన తన మేనమామ తేజావత్‌‌ చంద (70) గంజాయి సప్లయ్ చేసేవాడు. డ్రైవింగ్‌‌ కోసం అప్పుడప్పుడు వీరన్నను తీసుకెళ్తుండేవాడు. ఇద్దరు కలిసి వైజాగ్ ఏజెన్సీ ఏరియాలోని డొంకరాయి, సిలేరు, మల్కన్‌‌గిరి నుంచి హైదరాబాద్‌‌ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని స్మగ్లింగ్‌‌ చేసేవారు.

ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్‌‌ సహాకారంతో.. 

చంద, వీరన్నకు గ్రౌహౌండ్స్‌‌ కానిస్టేబుల్స్‌‌గా పనిచేస్తున్న తేజావత్‌‌ ప్రశాంత్‌‌ నాయక్‌‌, రాములు తోడయ్యారు. వీరంతా కలిసి ప్రత్యేక నెట్‌‌వర్క్‌‌గా ఏర్పడి గంజాయి స్మగ్లింగ్‌‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో వీరన్నకు ప్రశాంత్‌‌ నాయక్‌‌ మావయ్య అవుతారు. బినామీ పేర్లతో నాలుగు హై-ఎండ్‌‌ కార్లు కొన్నారు. వాటికి కొద్దిగా మార్పులు చేసి, పోలీస్‌‌ వెహికల్స్‌‌లా సైరన్‌‌, హారన్‌‌ ఫిక్స్ చేయించారు. గంజాయిని ప్యాక్ చేసేందుకు ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేయించారు. 

ఫేక్ పోలీస్ ఐడీ కార్డులు, కార్లకు పోలీస్ స్టిక్కర్స్ అతికించారు. ఆర్టీఏ, స్థానిక పోలీసులకు అనుమానం రాకుండా పోలీస్ గెటప్‌‌లు కూడా వేసేవారు. గంజాయి ట్రాన్స్‌‌పోర్ట్‌‌ చేసే సమయాల్లో వీరన్న ఫ్లైట్స్‌‌లోనే జర్నీ చేసేవాడు. తన సొంతూరుకు చెందిన అజ్మీరా వీరన్న అలియాస్ లాలు(21), సర్నేని మనోజ్‌‌ (20)లతో పాటు గూడురు మండలం బ్రహ్మణపల్లికి చెందిన మెరుగు మధు (39), మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాకు చెందిన మహ్మద్ జహంగీర్‌‌(40) గంజాయి ట్రాన్స్‌‌పోర్టర్లుగా నియమించుకున్నాడు. పోలీస్ సైరన్‌‌తో చెక్‌‌పోస్ట్‌‌లను దాటుతూ, గంజాయి ఉన్న కార్లను మహారాష్ట్రకు తరలించేవారు. విజయవాడ, వరంగల్‌‌ హైవేల మీదుగా, హైదరాబాద్‌‌ ఔటర్‌‌ ‌‌రింగ్‌‌ రోడ్‌‌‌‌ మీదుగా మహారాష్ట్రకు ట్రావెల్‌‌ చేసేవారు. అక్కడ బీడ్‌‌లో నిఖిలేశ్‌‌ అనే పెడ్లర్‌‌‌‌కు గంజాయి అందించేవాడు. వైజాగ్‌‌ ఏజెన్సీలో రూ.4 వేలకు కొని, అక్కడ రూ.25 వేలకు అమ్మేవారు. 

భారీగా ప్రాపర్టీస్‌‌ కొనుగోలు చేసి.. 

గంజాయి స్మగ్లింగ్‌‌ ద్వారా వచ్చిన డబ్బుతో వీరన్న ఐదు కార్లు, జేసీబీ కొనుగోలు చేశాడు. నాలుగు కార్లను గంజాయి ట్రాన్స్‌‌పోర్ట్‌‌కు వినియోగించేవాడు. దాదాపు రూ.4 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడు. వీరన్న సంపాదనతో స్థానికులు కూడా అతనితో కలిసి పనిచేశారు. సుమారు 20 మందికి పైగా గంజాయి ట్రాన్స్‌‌పోర్టర్లుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరన్న నెట్‌‌వర్క్ సమాచారం అందుకున్న టీన్యాబ్‌‌ ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని టీమ్స్‌‌ నిఘా పెట్టాయి. పక్కా సమాచారంతో వీరన్నతో పాటు అజ్మీర్ వీరన్న, సర్నేని మనోజ్‌‌, మెరుగు మధు, కానిస్టేబుల్‌‌ ప్రశాంత్ నాయక్‌‌, మహ్మద్ జహంగీర్‌‌‌‌ను బుధవారం లంగర్‌‌‌‌హౌస్‌‌లో అరెస్ట్ చేసింది. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌‌ రాములు పోలీసుల అదుపులో ఉన్నాడు.