మహిళా ఇంటి ఓనర్లే టార్గెట్​ : భార్యాభర్తలమని నమ్మించి దోచుకుంటున్న గ్యాంగ్ 

మహిళా ఇంటి ఓనర్లే టార్గెట్​ : భార్యాభర్తలమని నమ్మించి దోచుకుంటున్న గ్యాంగ్ 

ఇద్దరిని అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు

శంషాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: భార్యాభర్తలమని నమ్మించి రెంటెడ్ ఇండ్లల్లో దిగి  మహిళా ఇంటి ఓనర్లకు మత్తు మందు ఇచ్చి హత్య, దోపిడీలు చేస్తున్న ఇద్దరిని షాద్ నగర్ పోలీసులు  అరెస్ట్ చేశారు.  10  తులాల బంగారం, 20 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి బినకొండకు చెందిన గుంజి వెంకటేశ్వరరావు(33), ఇప్పలపల్లికి చెందిన సానుగొమ్ముల నాగలక్ష్మి(30) పాతనేరస్తులు. భార్యాభర్తలమని నమ్మించి వీరు రెంటెడ్ ఇండ్లల్లో దిగి వరుస చోరీలు చేస్తున్నారు. గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రామ్‌‌‌‌‌‌‌‌నగర్​ కాలనీలో మంగలి సువర్ణ (45) ఇంట్లో రెంట్‌‌‌‌‌‌‌‌కి దిగారు.  సువర్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్న టైమ్ లో ఆమె తాగే కల్లులో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపారు. సువర్ణ మత్తులోకి వెళ్లాక ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. తర్వాత వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి  గుంటూరుకి వెళ్లారు. కొంతకాలం తర్వాత కొట్టేసిన బంగారాన్ని సూర్యాపేటలోని  ముత్తూట్ ఫైనాన్స్​లో తాకట్టు పెట్టి రూ.లక్షా600 అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బుతో బెంగళూరు వెళ్లి జల్సాలు చేసి తిరిగి గుంటూరుకి వచ్చారు.

మళ్లీ  చోరీకి  స్కెచ్ వేసిన వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘట్ కేసర్ చేరుకున్నారు. క్రిస్టియన్ కాలనీలో ఓ ఇంట్లో రెంట్ కి దిగారు. తాము దంపతులమని ఇంటి ఓనర్ లక్ష్మిని నమ్మించారు. లక్ష్మి తినే కూరలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపి ఆమెను హత్య చేసి బంగారు నగలతో ఎస్కేప్ అయ్యారు. షాద్ నగర్, ఘట్ కేసర్​లో జరిగిన ఈ చోరీ కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ద్వారా హత్య, దోపిడీలు చేస్తున్న ఈ దొంగ దంపతుల వివరాలు తెలుసుకున్నారు. గతంలో షాద్​నగర్​లోని మాదేసాయన్న అనే వ్యక్తి దగ్గర నిందితులు కొంత బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. సాయన్నకు డబ్బు ఇచ్చి బంగారం తీసుకుని వెళ్లేందుకు వెంకటేశ్వరావు, నాగలక్ష్మి బుధవారం  షాద్ నగర్ వచ్చారు. అప్పటికే వీరిపై నిఘా ఉంచిన పోలీసులు  ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులపై ఏపీ,తెలంగాణలో మొత్తం 12 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టిన బంగారు నగలను రికవరీ చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ను రెడీ చేస్తున్నట్టు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.