జాబ్​ ఇప్పిస్తామంటూ మోసం

జాబ్​ ఇప్పిస్తామంటూ మోసం

మందమర్రి, వెలుగు: జాబ్​ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి ముగ్గురు మహిళల ముఠా భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో శనివారం వెలుగుచూసింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు చెందిన 16 మంది నిరుద్యోగుల నుంచి రూ. 65 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్​కు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా సీతారాంపల్లికి చెందిన సవిత(రజిత), రెడ్డికాలనీకి చెందిన ఉమ 2020లో గెట్​ టు గెదర్​ పార్టీలో ఫ్రెండ్స్​అయ్యారు. తాను వివిధ పభుత్వ శాఖలు, అవుట్​సోర్సింగ్​లో ఉద్యోగాలు పెట్టిస్తున్నానని, అవసరం ఉన్నవారికి చెప్పాలంటూ ఉమతో రజిత పేర్కొంది. ఆమె మాటలు నమ్మిన ఉమ డబ్బులు కట్టడంతోపాటు తెలిసినవారికి కూడా విషయం చెప్పింది. వారందరి నుంచి రజిత పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఎంతకూ ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని బాధితులు రజితను నిలదీశారు. తన మామయ్య కరీంనగర్​ఏరియాలో సీఐగా చేస్తున్నాడని చెప్పడంతోపాటు గోదావరిఖనికి చెందిన సాగర్​ అనే వ్యక్తి ద్వారా బాధితులను రజిత బెదిరించింది. అదే సమయంలో రజిత నుంచి డబ్బులు ఇప్పిస్తానని, తనకు కొంత మొత్తం ఇవ్వాలని రజిత ఫ్రెండ్​ నస్పూర్​కు చెందిన కండలి సుశీల మధ్యవర్తిత్వం చేసింది. తనకు హ్యుమన్​ రైట్స్​సంఘం సపోర్ట్​ఉందని, ఉద్యోగాలు కావాలంటే తన ఫ్రెండ్,​ సీఎం చాంబర్​లో పనిచేసే హైదరాబాద్​ అంబర్​పేటకు చెందిన రూప (స్వరూప) ద్వారా ఇప్పిస్తానని నమ్మబలికింది. రూప ఫోన్​ నంబర్​ బాధితులకు ఇచ్చింది. రజిత నుంచి డబ్బులు తిరిగి వసూలు చేసుకోవడంతో పాటు జాబ్ లు వస్తాయనే ఆశతో  బాధితులు పలువురు రూపను కాంటాక్ట్​ అయ్యారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో తనకు పరిచయం ఉందని రూప నమ్మించడంతో పలువురు ఫోన్​ద్వారా వేలాది రూపాయలు పంపించారు. కొందరూ నేరుగా వెళ్లి కలిశారు. మొత్తంగా 16 మంది బాధితులు రజిత, సుశీల, రూపకు రూ.65 లక్షల వరకు ముట్టజెప్పారు. నెలలు గడుస్తున్న ఉద్యోగాలు రాక, ఇచ్చిన డబ్బులు తిరిగి  ఇవ్వకపోవడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. భూపాలపల్లికి చెందిన శ్రావణ్​కుమార్, మంచిర్యాలకు చెందిన ఉమ, మందమర్రికి చెందిన సుజాత డీసీపీకి ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్, సింగరేణి, ఎన్టీసీపీ సంస్థలలో అకౌంటెంట్, క్లర్క్, అటెండర్ ఉద్యోగాల పేరుతో ముగ్గురు మహిళలు రూ. 65 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదు అందిందని డీసీపీ చెప్పారు. విచారణ చేపట్టామని, త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు.