డంపింగ్ ​చెత్తకు నిప్పు..రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్న బల్దియా

డంపింగ్ ​చెత్తకు నిప్పు..రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్న బల్దియా
  • కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తికి సిబ్బంది వింత సమాధానం 
  • గంటల పాటు తగలబడుతున్నా స్పందించలే..
  •  పని చేయని మై జీహెచ్ఎంసీ’ యాప్

హైదరాబాద్, వెలుగు : డంపింగ్​చెత్తకు నిప్పు పెట్టారని, భారీ ఎత్తున వ్యాపిస్తున్న పొగతో జనాలంతా ఇబ్బందులు పడుతున్నారని జీహెచ్ఎంసీ హెల్ప్​లైన్​కు ఫోన్​చేసిన ఓ వ్యక్తికి.. సిబ్బంది ఇచ్చిన సమాధానం విని బిత్తరపోవాల్సి వచ్చింది. బంజారాహిల్స్​న్యూ ఎమ్మెల్యే కాలనీలోని యునిసెఫ్ ఆఫీ దగ్గరలో ఓ చెత్త డంపింగ్ యార్డు కొనసాగుతోంది. లోక ల్ గా సేకరించిన చెత్తను ఇక్కడ డంప్​చేసి తర్వాత వెహికల్స్​లో తరలిస్తుంటారు. డంప్​చేసిన చెత్తకు మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎగిసిపడిన మంటలు, పొగ, దుర్వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

స్థానికంగా ఉండే సతీశ్ వెంటనే జీహెచ్ఎంసీ హెల్ప్​లైన్​నంబర్ 040--–21111111 నంబర్​కు కాల్​చేసి విషయం చెప్పాడు. వివరాలు అన్నీ నమోదు చేసుకున్న సదరు సిబ్బంది 48 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చారు. ‘ఇది ఎమర్జెన్సీ. పొగతో ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే పరిష్కరించాలి కదా. 48 గంటల వరకు బాధలు పడాల్సిందేనా’ అని సతీశ్​ప్రశ్నించగా..  తామేమీ చేయలేమని, కంప్లయింట్​రిజిస్టర్ అయినట్టు మెసేజ్​వస్తుందని చెప్పి జీహెచ్ఎంసీ సిబ్బంది ఫోన్​కట్​చేశారు. 

కంప్లయింట్​ తీసుకోని యాప్​

సిటీలో ఏదైనా సమస్య వస్తే కంప్లయింట్​చేసేందుకు, ఇతర సేవలకు బల్దియా ‘మై జీహెచ్ఎంసీ యాప్’​ రూపొందించింది. ఇందులో శానిటేషన్​కు సంబంధించిన కాలమ్​క్లిక్​చేస్తే న్యూ కంప్లయింట్​రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ పేరు, సమస్య, ల్యాండ్​మార్క్, ఇతర వివరాలు, ఫోన్​నంబర్​ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫొటోలు అప్​లోడ్​చేయాలి. తర్వాత సబ్మిట్​కొడితే ఫిర్యాదు నమోదవుతుంది.

కానీ యాప్​లో పైన సమస్యకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్​కొడితే ‘ఫెయిల్డ్​టు రిజిస్టర్ కంప్లయింట్’ అని వస్తోంది. ఎన్నిసార్లు చేసినా ఇదే రిపీటవుతోంది. ఎమర్జెన్సీ సమస్యలు పరిష్కరించేందుకు బల్దియా మరింత చొరవ చూపాలని సిటీ ప్రజలు కోరుతున్నారు.