
శేరిలింగంపల్లి, వెలుగు: సెల్‌ఫోన్ విషయంలో ఇంటి పక్క ఉండే బాలుడితో గొడవ పడ్డ ఓ బాలిక విషయం తల్లికి తెలిస్తే కొడుతుందనే భయంతో సూసైడ్ చేసుకుంది. మియాపూర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మియాపూర్‌లోని న్యూ కాలనీలో ఉండే అనిల్, సంగీత దంపతుల కూతురు అనిత(14) ఆరో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం అనిల్,సంగీత పనికి వెళ్లారు. అనిత మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే తన ఫ్రెండ్ అయిన బాలుడి సెల్ఫోన్లో ఆడుకుంటుంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కిందపడి పగిలిపోయింది. దీంతో బాలుడు అనితని కొట్టాడు. ఈ విషయాన్ని అనిత తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత తల్లి వస్తే తతను కొడుతుందేమోననే భయంతో ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుంది. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ అనిత సాయంత్రం చనిపోయింది. కేసు ఫైల్ చేసినట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు.